V6 News

ఇలాంటి బ్రాండెడ్ బాటిళ్ల మద్యాన్ని కల్తీ చేస్తున్నారు.. బీ అలర్ట్ మద్యం ప్రియులు

ఇలాంటి బ్రాండెడ్ బాటిళ్ల మద్యాన్ని కల్తీ చేస్తున్నారు.. బీ అలర్ట్ మద్యం ప్రియులు

కలియుగం కాదు.. కల్తీయుగం అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. పాలు, వంట నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఇంట్లో వాడే ప్రతి వస్తువు కల్తీ మయం అయిపోయింది. లేబుల్స్ చూస్తే ఒరిజినల్ ఉంటుంది కానీ.. లోపల సరుకు కల్తీ ఉంటుంది. ఇలా ఏ వస్తువు చూసినా ఏది కల్తీనో, ఏది ఒరిజినలో గుర్తుపట్టలేని విధంగా తయారయ్యింది పరిస్థితి. ఇక కల్తీ మద్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎక్సైజ్‌అధికారులు కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ఎంత కృషి చేస్తున్నా.. తరచూ ఎక్కడో ఒక చోట కల్తీ మద్యం దందా బయటపడుతూనే ఉంది. శుక్రవారం ( డిసెంబర్ 12 ) వరంగల్ లో కాస్ట్లీ మద్యం బ్రాండ్ మిక్సింగ్ చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

వరంగల్ జిల్లాలో ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యాన్ని మిక్సింగ్‌  చేసి అమ్మకాలు చేపడుతూ ఎస్టీఎఫ్‌ డీ టీమ్‌కు పట్టుబడ్డాడు ఓ వ్యక్తి.వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన బానోత్‌ నర్వా అనే వ్యక్తి   ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధరల మద్యాన్ని కలిసి బ్రాండ్‌  మిక్సింగ్‌ చేసి వినియోగదారులకు తక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు.ఇలా బ్రాండ్‌ మిక్సింగ్‌ మద్యం అమ్మకాలు జరుపుతున్న తరుణంలో నర్సంపేట్‌లో పట్టుబడ్డాడు బానోత్ నర్వా. 

అక్కడి నుంచి మకాం మార్చి తమ బంధువులు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ఖమ్మం ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ మళ్లీ బ్రాండ్‌ మిక్సింగ్‌ చేస్తూ మద్యం అమ్మకాలు జరుపుతుండగా.. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్‌ డీ టీమ్‌ సీఐ నాగరాజు, సిబ్బంది కలిసి ఖమ్మం వెళ్లి బానోత్ నర్వాను పట్టుకున్నారు. 

మద్యం బ్రాండ్‌ మిక్సింగ్‌ను ఎలా చేస్తారు అనే తీరును విడియో తీసి ఎస్టీఎఫ్‌ సిబ్బంది బయట పెట్టడంతో అవాక్కవుతున్నారు మద్యం ప్రియులు.నిందితుడిని బ్రాండ్‌ మిక్సింగ్‌ బాటిళ్లను ఖమ్మంలో ఎక్సైజ్‌ స్టేషన్‌ అప్పగించినట్లు తెలిపారు అధికారులు.