హైదరాబాద్ సిటీ, వెలుగు: అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నుంచి 27వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు జయంత్ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సేవా కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ ను ప్రెసిడెంట్ సతీశ్ రెడ్డి, నర్సిరెడ్డి సాయి ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డా.. మాతృభూమిపై ప్రేమతో 35 ఏళ్ల క్రితం తమ సంఘం ఆవిర్భవించిందని చెప్పారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలతో తెలుగు వారికి అన్ని రకాలుగా సేవలు చేయాలన్న లక్ష్యంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు గ్రామీణ మండల ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ముఖ్య అతిథులుగా గవర్నర్ విష్ణు దేవ్ వర్మ, మంత్రులు హాజరవుతారని చెప్పారు. 27న రవీంద్ర భారతిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంతో ముగుస్తాయని చెప్పారు.

