V6 News

ఓట్ల కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి : సెల్ టవర్ ఎక్కిన ఓడిన సర్పంచ్ అభ్యర్థి భర్త

ఓట్ల కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి : సెల్ టవర్ ఎక్కిన ఓడిన సర్పంచ్ అభ్యర్థి భర్త

తెలంగాణ పంచాయితీ ఎన్నికల మొదటి విడత పూర్తయ్యింది. రిజల్ట్స్ వచ్చేశాయి. గెలిచినోళ్లు హ్యాపీ.. ఓడినోళ్లే ఇప్పుడు లబోదిబో అంటున్నారు. లక్షలకు లక్షలు ఖర్చయ్యింది.. అయినా ఓడిపోయాం అనే బాధ వాళ్లను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త.. ఎన్నికల్లో ఓటర్లకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటే ఆందోళనకు దిగాడు. అవును.. మీరు చదువుతున్నది నిజమే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాలో టెన్షన్ పుట్టించిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం హర్యా తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా మాలోతు చింతామణి అనే మహిళ పోటీ చేసింది. ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎన్నికల్లో నేను ఓటర్లకు డబ్బులు పంచాను.. ఓడిపోయాను కాబట్టి నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కాడు అభ్యర్థి భర్త రంగా. ఓటర్లను పంచిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే.. సెల్ టవర్ పైనుంచి దూకి చస్తానంటూ బెదిరించాడు.

హర్యా తండా పరిధిలోకి వచ్చే సుకిని తండాలో దొంగ ఓట్లు వేశారని.. గ్రామంలో లేని వాళ్లవి.. శబరిమల కొండకు వెళ్లిన వాళ్ల ఓట్లను కూడా ప్రత్యర్థులు రిగ్గింగ్ చేసి వేసుకున్నారని.. అందుకే ఓడిపోయినట్లు చెబుతున్నాడు. ఓట్ల సంగతి సరే.. ఓట్ల కోసం తీసుకున్న డబ్బులను జనం తిరిగి ఇవ్వాలంటూ సెల్ టవర్ పైనుంచే తన సందేశాన్ని గ్రామస్తులకు చెబుతున్నాడు. 

విషయం తెలిసిన పోలీసులు తండాకు వచ్చారు. సెల్ టవర్ ఎక్కిన రంగాతో మాట్లాడారు. సెల్ టవర్ దిగి వస్తే కూర్చుని మాట్లాడుకుందాం అంటూ బుజ్జగిస్తున్నారు పోలీసులు. ఓట్ల కోసం పంచిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే దూకి చనిపోతానంటూ రంగా బెదిరింపులకు దిగుతుండటంతో తండాలో టెన్షన్ నెలకొంది. సెల్ టవర్ చాలా పెద్దదిగా ఉండటం వల్ల పైకి ఎక్కి కిందకు దించటానికి కష్టపడుతున్నారు పోలీసులు.