బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-లో ఎస్సీ, ఎస్టీల పెట్టుబడులకు అద్భుత అవకాశం కల్పించారని భారతీయ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక సంఘాల సమాఖ్య చైర్మన్ పుట్టపాగ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు పెట్టుబడుల ఒప్పందాల ఎంఓయూ పత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గ్లోబల్ సమిట్ చారిత్రాత్మకమైనదన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక పారిశ్రామిక పాలసీ ఇదేనన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు, మాంసం, పండ్లు, కూరగాయల శుద్ధి, గ్రామీణ గిడ్డంగులు, ఫార్మా ఇతర మౌలిక సదుపాయాల రంగాలలో ఎస్సీ, ఎస్టీ కంపెనీల నుంచి సుమారు రూ.580 కోట్ల పెట్టుబడి కోసం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం జరిగిందన్నారు. దేశ చరిత్రలో మొదటి సారిగా ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమైన పెట్టుబడిదారులుగా ముందుకు వస్తున్నారన్నారు. తమను ప్రపంచ కార్పొరేట్ సంస్థలతో సమానంగా ఉంచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

