లక్కు.. కిక్కు ఓరుగల్లులో ముగిసిన లిక్కర్‍ లక్కీడ్రాలు

లక్కు.. కిక్కు ఓరుగల్లులో ముగిసిన లిక్కర్‍ లక్కీడ్రాలు
  • 5 జిల్లాల పరిధిలో 294 షాపులు.. 10,493 దరఖాస్తులు 
  • 292 షాపులకు లక్కీడ్రా తీసిన ఐదు జిల్లాల కలెక్టర్లు
  • గోవిందరావుపేట, చల్వాయి షాపుల లక్కీడ్రా వాయిదా
  • వరంగల్‍ అర్బన్‍లో గంటన్నర ఆలస్యమైన డ్రా

వరంగల్, వెలుగు: ఓరుగల్లులో 294 'లిక్కర్ షాపుల లక్కీ పర్సన్స్' ఎవరో తేలిపోయింది. అధికారులు తీసిన డ్రాలో షాప్ వచ్చినోళ్లు ఆనందంతో ఎగిరి గంతేయగా పెద్దమొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్​ చేసినా ఫలితం దక్కనివారు డిసప్పాయింట్‍ అయ్యారు. సోమవారం ఉదయం నుంచే ఓరుగల్లులోని 5 జిల్లాల పరిధిలోని లక్కీడ్రా కేంద్రాలన్నీ 10,493 దరఖాస్తుదారులతో సందడిగా కనిపించాయి. పురుషులు, మహిళలు, వృద్ధులు టెన్షన్‍లో కనిపించారు.

ఎక్సైజ్‍అధికారులు సీరియల్‍ ప్రకారం వారిని లోపలకు పిలిచి  లైన్‍లో నిలుచోబెట్టారు. అప్లికేషన్ నంబర్‍, దరఖాస్తు వేసిన వ్యక్తిపేరు సరిపోలుతుందో లేదో పరిశీలించారు. అందరూ వచ్చాక వారిముందే టోకన్లన్నీ డబ్బాలో వేయగా, అక్కడకు వచ్చిన కలెక్టర్లు లక్కీడ్రా తీశారు.  

5 జిల్లాల్లో లక్కీడ్రా.. 

వరంగల్‍ అర్బన్‍ జిల్లా పరిధిలో నగరంలోని అంబేద్కర్‍ భవన్‍లో హనుమకొండ కలెక్టర్‍ స్నేహా శబరీశ్ ముఖ్య అతిథిగా లక్కీడ్రా నిర్వహించగా, ఎక్సైజ్‍ డిప్యూటీ కమిషనర్‍ అంజన్‍రావు, డీపీఈవో చంద్రశేఖర్‍ పాల్గొన్నారు.

వరంగల్‍ రూరల్‍ జిల్లా పరిధి లక్కీడ్రా వరంగల్‍ ఉర్సుగుట్ట వద్దనున్న నాని గార్డెన్‍లో ఏర్పాటు చేశారు. అడిషనల్​ కలెక్టర్‍ సంధ్యారాణి, డీపీఈవో అరుణ్‍ కుమార్‍ డ్రా పద్ధతిలో షాపులు కేటాయించారు.

జనగామ జిల్లా పరిధిలో హైదరాబాద్ రోడ్డులోని నందన్‍ గార్డెన్‍లో కలెక్టర్‍ రిజ్వాన్‍ బాషా షేక్‍ చేతులమీదుగా లక్కీడ్రా నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్‍, ఏసీపీ పండరి చేతన్‍, డీపీఈవో అనిత పాల్గొన్నారు.

మహబూబాబాద్‍ జిల్లాలో స్థానిక ఏబీ గార్డెన్స్​లో కలెక్టర్‍ అద్వైత్‍ కుమార్‍, ఎక్సైజ్‍ అధికారులు లక్కీడ్రా పద్ధతిలో వైన్‍ షాపులు కేటాయించారు.

భూపాలపల్లి జిల్లాలోనే ములుగు జిల్లా సైతం కలిసి ఉంది. స్థానిక ఇల్లందు క్లబ్‍ హౌజ్‍లో కలెక్టర్‍ రాహుల్‍ శర్మ, ఎక్సైజ్‍ సూపరింటెండెంట్‍ శ్రీనివాస్‍, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‍ నరేశ్​రెడ్డి, డీఎస్పీ సంపత్‍రావు లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించారు.

ఆలస్యం.. నిలదీత.. వాయిదా

వరంగల్‍ అర్బన్‍ జిల్లా పరిధిలో లక్కీడ్రా ప్రక్రియ గంటన్నర ఆలస్యం కావడంతో దరఖాస్తుదారులు ఆఫీసర్లను నిలదీశారు. ఉదయం 11 గంటలకు డ్రా చేపట్టాల్సి ఉండగా, కలెక్టర్‍ స్నేహ శబరీష్‍ 12.30 గంటల వరకు అంబేద్కర్‍ భవన్‍ చేరుకోలేదు. 

భూపాలపల్లి జిల్లా పరిధిలో 59 వైన్‍ షాపులు ఉండగా, 57 షాపులకే డ్రా తీశారు. గోవిందరావుపేట, చల్వాయి షాపులకు దరఖాస్తులు తక్కువగా రావడంతో అధికారులు లక్కీడ్రా వాయిదా వేశారు.

     జిల్లా                                   వైన్ షాపులు    అప్లికేషన్లు
వరంగల్ అర్బన్                            67                 3,175
వరంగల్ రూరల్                            57                 1,958
జనగామ                                          50                 1,697
మహబూబాబాద్                             61                 1,800
భూపాలపల్లి/ములుగు                   59                 1,863
మొత్తం                                          294                 10,493