- ఎక్సైజ్ సర్కిళ్ల వారీగా షాపుల కేటాయింపు
- డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల ద్వారా అమ్మకాలు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్జిల్లావ్యాప్తంగా వైన్స్ షాపులకు లక్కీ డ్రా ముగిసింది. 20-25–27 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని 290 షాపులకు ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎక్సైజ్ ఆఫీసర్లు లక్కీ డ్రా నిర్వహించారు. సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన దరఖాస్తుదారుల ఎంపిక ప్రారంభమైంది. ఎక్సైజ్ సర్కిళ్లవారీగా షాపుల ప్రాతిపదికగా డ్రా తీశారు. డబ్బాలో నంబర్లు వేసి.. కలెక్టర్లు డ్రా తీసి పేర్లు ప్రకటించారు. ఎంపికైన లైసెన్స్‌దారులు మంగళవారంలోపు ఎక్సైజ్ ట్యాక్స్ మొదటి వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. వీరికి డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల్లో అమ్మకాలకు అనుమతించనున్నారు.
కరీంనగర్ జిల్లాలో..
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో వైన్స్ షాపుల టెండర్ లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 94 షాపులకు గీత కార్మికులకు 17, ఎస్సీలకు 9 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. లక్కీ డ్రాలో 22 షాపులను మహిళలు గెలుచుకోగా, 72 షాపులను పురుషులు గెలుచుకున్నారు.
గతంలో షాపులు దక్కించుకున్నవారిలో కొందరికి ఈసారి లాటరీ కలిసిరాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మొత్తం 2,730 దరఖాస్తులు రాగా వీటి ద్వారా రూ.81.90 కోట్ల ఆదాయం సమకూరింది. గంగాధర మండలం కురిక్యాల వైన్స్ షాపునకు అత్యధికంగా 47 అప్లికేషన్లు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి వి. శ్రీనివాస రావు, ఎక్సైజ్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ జే. అరుణశ్రీ ఆధ్వర్యంలో వైన్స్ షాపులకు డ్రా నిర్వహించారు. జిల్లాలోని 74 (ఏ4) మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేశారు. మొత్తం 1,507 దరఖాస్తులు రాగా మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియను వీడియో రికార్డ్ చేయించినట్లు అడిషనల్ కలెక్టర్ వెల్లడించారు. లైసెన్స్ ఫీజులో 6వ వంతు వెంటనే చెల్లించి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, దరఖాస్తు దారులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మద్యం షాపుల టెండర్ల ఓపెన్ డ్రా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 48 దుకాణాలకు 1,381 అప్లికేషన్లు రాగా.. గౌడ్‌లకు 9, ఎస్సీలకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐలు శ్రీనివాస్, రాజేశ్వర్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాలలో..
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్‌లో ఏ4 కేటగిరీ వైన్‌షాపుల కోసం డ్రా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,966 దరఖాస్తులు రాగా.. వీటి ద్వారా ప్రభుత్వానికి 58.98 కోట్ల ఆదాయం సమకూరింది. లాటరీ పద్ధతిలో 71 షాపులకు లైసెన్స్‌దారులు ఎంపిక కాగా వీరిలో ఎస్సీలకు 8, గౌడ్‌లకు 14 కేటాయించారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
పట్టరాని సంతోషం..
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లోని మద్యం దుకాణానికి రూ.3 లక్షలతో దరఖాస్తు చేసుకున్న పల్లె వెంకటేశంకు డ్రాలో వైన్స్ షాపు దక్కింది. ఈ షాపు కోసం 34 మంది దరఖాస్తు చేసుకోగా.. పల్లె వెంకటేశం నంబరుకు డ్రా తగిలింది. దీంతో ఆయన పట్టరాని సంతోషంతో స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి ఆ శుభవార్తను పంచుకున్నారు. గతంలోనూ షాపు కోసం కొందరితో కలిసి దరఖాస్తు చేసుకుంటే రాలేదని.. ఇప్పుడు తాను ఒంటరిగా అప్లికేషన్ ఇస్తే షాపు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
