
- వర్షాకాలం నేపథ్యంలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టిపెట్టండి: సీతక్క
- డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కాకుండా చూడండి
- వరదలతో నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టండి
- డీపీవోలు, జడ్పీ సీఈవోలతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అలర్ట్గా ఉండాలని, శానిటేషన్పై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. డ్రైనేజీలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ, రోడ్ల మీద చెత్త ఉండకుండా చూడాలని, చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డులకు తరలించాలని సూచించారు. డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు మంచి నీటి పైపులు లీకేజ్ కాకుండా సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించి, ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
వరదలతో నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్ నుంచి జిల్లా పంచాయతీ అధికారులు ( డీపీవో), జడ్పీ సీఈవోలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో దోమలతో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగు నీరు కలుషితం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్క్యులర్ జారీ చేశారు.
కాగా, దోమల వ్యాప్తిని తగ్గించేందుకు ఖాళీ టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర చోట్ల నీరు నిలువకుండా ఉండేలా వారంలో ఒక రోజు డ్రై డే చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి రోజు ఫాగింగ్ చేపట్టాలని, కోళ్ల ఫారాల ఓనర్లతో మాట్లాడి శానిటేషన్ జాగ్రత్తలు సూచించాలని అన్నారు. వీటిపై జిల్లా, మండలాధికారులు నిత్యం రిపోర్ట్ లు తయారు చేసి, కమిషనర్ కు పంపించాలని ఆదేశించారు.
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్కారు రెడీ
మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త, పాత కనెక్షన్స్పై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని, తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాలపై అలర్ట్గా ఉండాలని సూచించారు.
ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద ఉండొద్దని అన్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అందుకు డప్పు చాటింపుతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రివ్యూలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ అనితా రామచంద్రన్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.