భద్రాచలం, వెలుగు: భద్రగిరిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు శనివారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో రామక్షేత్రం మారుమోగింది. తొలుత ఉత్సవమూర్తులకు ఏకాంతంగా గర్భగుడిలో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. సీతారామచంద్రస్వామి తొలిరోజు భక్తులకు మత్స్య అవతారంలో దర్శనమిచ్చారు. అర్చకులు మత్స్య అవతారంలో అలంకరించి పూజలు చేశారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు.
తర్వాత మత్స్యవతార రామయ్యను బేడా మండపంలోకి 12 మంది ఆళ్వార్లతో తీసుకొచ్చి భక్తుల దర్శనార్ధం ఉంచారు. వేదాలు అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురుడిని సంహరించడానికి విష్ణుమూర్తి మత్స్యావతారంను దాల్చాడని వేదపండితులు వివరించారు. నేడు(ఆదివారం) స్వామి కూర్మావతారంలోదర్శనం ఇవ్వనున్నారు.
ఉత్సవాలు తొళక్కంతో షురూ
అధ్యయనోత్సవాల్లో భాగంగా చతుర్వేద పారాయణాలు , రామాయణ పారాయణం చేసే రుత్విక్కులకు, వేదపండితులకు దీక్షా వస్త్రాలను ఈవో దామోదర్‌రావు అందజేశారు. తర్వాత ప్రత్యేక ఆరాధనలో ముందుగా వేదాలు, ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్ర మహత్యం, దివ్యప్రబంధంతో అధ్యయాన్ని ప్రారంభించారు. దీనినే సంప్రదాయబద్ధంగా తొళక్కం అంటారు. గంటపాటు నాళాయర దివ్యప్రబంధంలోని పద్యాలను సేవాకాలం చేశారు. తర్వాత కోలాటాలు,రామనామ స్మరణలతో మత్స్యవతార రామయ్యను ఊరేగింపుగా ఆలయం నుంచి వైకుంఠ ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపైకి తీసుకొచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని పులకించారు. తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కూచిపూడి నృత్యాలు, సంగీత కచేరీలతో పాటు హరికథా కాలక్షేపంలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం భక్తుల జయజయధ్వానాల మధ్య మత్స్యవతార రామయ్య తిరువీధి సేవకు బయలుదేరారు. మాడవీధుల గుండా తాతగుడి సెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలందుకుని తిరిగి ఆలయానికి వచ్చారు. అధ్యయనోత్సవాల్లోని పగల్‌పత్ ఉత్సవాల్లో స్వామి దశావతారాల్లో దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో నిత్య కల్యాణాలను రద్దు చేశారు. ఈసారి పగల్‌పత్ ఉత్సవాల్లో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేశారు.ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేయడంలో ఈ నిర్ణయం ఉపయోగపడింది. భక్తులతో ఉత్సవ ప్రాంగణం కళకళలాడింది.
