పాండవ వనవాసం ‘అర్జున లొద్ది’

పాండవ వనవాసం ‘అర్జున లొద్ది’

మహాభారతం అనగానే కురుక్షేత్ర యుద్ధం, పాండవ వనవాసం వంటి ఘట్టాలు గుర్తొస్తాయి. అయితే పాండవులు వనవాసం చేసేటప్పుడు ఒకే చోట ఉండలేదు. అడవుల్లో తిరుగుతూ చాలా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. అలాంటి ప్రాంతాల్లో ఒకటి అర్జున లొద్ది. ఇక్కడ పాండవులు సంచరించారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. 

::: తిర్యాణి, వెలుగు
కురుక్షేత్ర యుద్ధవీరులైన పాండవులు వనవాసం చేసేటప్పుడు చాలా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. ఆ నివాస స్థలాల్లో అర్జునలొద్ది కూడా ఒకటని అక్కడి వాళ్ల నమ్మకం. ఇది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని రొంపల్లి పంచాయతీ పరిధిలో ఉంది. ఈ లొద్దిలో పాండవులు వనవాసం చేశారన్న నమ్మకంతో ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి, అక్కడ పూజలు చేస్తారు. ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు, టూరిస్ట్​లు వస్తుంటారు. 

ఆయుధాలు, కిరీటాల ఆనవాళ్లు
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు వాడిన ఆయుధాలు, ధరించిన కిరీటాల అచ్చులు ఇక్కడి బండరాళ్లపై ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. పాండవులు ఇక్కడ తిరిగారనేందుకు ఇక్కడున్న పొడవైన సొరంగ మార్గమే గుర్తు అని చెప్పొచ్చు. గుహ లోపల ఆవు పొదుగు ఆకారంలో ఒక శిల్పం ఉంది. అర్జున లొద్దిలో మొదలైన సొరంగ మార్గం మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని చిన్నయ్య, పెద్దయ్య దైవ క్షేత్రం వరకు ఉందంటున్నారు ఆదివాసీలు. ఇక్కడున్న కోనేటిలో నీళ్లు ఎప్పటికి ఇంకిపోవు. ఈ కోనేటిలో పాండవులు స్నానాలు చేసేవారని ఆదివాసీలు నమ్ముతారు.
‘‘పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ’’, ‘‘ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్’’ ప్రతినిధులు రెండేళ్ల క్రితం అర్జునలొద్దిలో పరిశోధనలు చేశారు. ఇక్కడ పురాతన కాలంలో మనుషులు నివాసం ఉన్నట్లు డిక్లేర్ చేశారు. దాంతో ప్రజల నమ్మకం ఇంకా బలపడింది.

పిల్లలకు వాళ్ల పేర్లే..
భీముడు, అర్జునులను యోధులుగా పూజిస్తారు ఆదివాసీలు. ఎక్కువగా భీముడు, అర్జునుల పేర్లు పిల్లలకు పెడుతుంటారు. భీమల్ పేన్ దేవుడు, పెర్స పేన్, జంగుబాయి దైవాలను ఇక్కడ దర్శనానికి తీసుకొచ్చి పుణ్య స్నానాలు చేయిస్తారు. ఏటా విత్తనాలకు ఇక్కడ పూజచేశాకే చేలల్లో చల్లుతారు. కొత్త పంటకు మొదట ఇక్కడ పూజ చేస్తారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక్కడ పూజ చేయిస్తేనే పంట బాగా పండుతుందని అక్కడి కుల పెద్దలు చెప్తున్నారు. భీమార్జునుల ఆశీస్సులతోనే అనుకూలమైన వ్యవసాయ కాలం ఉంటుందనేది ఆదివాసీల అపార నమ్మకం.