నస్పూర్ లోకి పులి వచ్చిందని కలకలం

నస్పూర్ లోకి పులి వచ్చిందని కలకలం
  •  ఏఐ జనరేటెడ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడు
  •      నిజమేననుకుని ప్రజల భయాందోళన 
  •     ఫారెస్ట్ సిబ్బంది ఉరుకులు పరుగులు  
  •      అది ఫేక్ న్యూస్ గా తేల్చిన ఆఫీసర్లు 

నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా నస్పూర్ ఆంధ్రాబ్యాంక్ ఏరియాలోకి బుధవారం రాత్రి పెద్దపులి వచ్చిందంటూ ఓ యువకుడు పోస్ట్ చేసిన ఫేక్ న్యూస్  కలకలం రేపింది. కొద్దిరోజులుగా శ్రీరాంపూర్, ఇందారం కోల్ మైన్స్ ఏరియాలో పులి సంచరిస్తుండగా.. అది నిజంగానే జనావాసాల్లోకి వచ్చిందేమోనని ప్రజలు భయాందోళన చెందారు. సమాచారం తెలియడంతో  అర్ధరాత్రి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శివ్ ఆశిష్ సింగ్, ఎఫ్డీవో సర్వేశ్వర్, ఎఫ్ఆర్వో రత్నాకర్ సిబ్బందితో నస్పూర్ ఆంధ్రాబ్యాంక్ ఏరియా వెళ్లారు. 

పులి కోసం గాలింపు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతో ఆచూకీ కోసం యత్నించినా ఎలాంటి ఫలితం లేదు.  సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలను ఫారెస్ట్ ఆఫీసర్లు పరిశీలించి ఏఐ జనరేటెడ్​ ఫొటోగా తేల్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడు సాయికిరణ్ ను గుర్తించారు. 

గురువారం డీఎఫ్ఓ, ఎఫ్డీవో, ఎఫ్ఆర్వో సిబ్బందితో నస్పూర్ ఆంధ్రాబ్యాంక్ ఏరియాకు వెళ్లి.. యువకుడితోనే అసలు విషయం చెప్పించారు. ఎవరైనా పులిని చూస్తే వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించాలని డీఎఫ్ వో సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.