ఒక్కో దేశానికి వ్యాపిస్తున్న ఒమిక్రాన్

ఒక్కో దేశానికి వ్యాపిస్తున్న ఒమిక్రాన్
  • ప్రస్తుతానికి మైల్డ్ సింప్టమ్సే వస్తున్నయ్.. సీరియస్ కావట్లే 
  • డేంజర్ కాదని కొందరు.. కావచ్చని మరికొందరి వాదనలు

జెనీవా/న్యూఢిల్లీ: ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రయాణాలపై ఆంక్షలు పెడుతున్నా ఒమిక్రాన్ వేరియంట్ ఒక్కో దేశానికీ క్రమంగా వ్యాపిస్తోంది. కొన్ని రోజుల కిందటే సౌత్ ఆఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్.. సోమవారం నాటికి సౌత్ ఆఫ్రికాతో సహా 13 దేశాలలో వ్యాపించినట్లు కన్ఫామ్ అయింది. బ్రిటన్ లోని స్కాట్లాండ్ లో ఆరుగురికి ఒమిక్రాన్ సోకినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లాండ్​లో మూడు కేసులు కన్ఫామ్ అయ్యాయి. దీంతో బ్రిటన్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరింది. అలాగే సౌత్ ఆఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ సిటీలోనే గత నాలుగు రోజుల్లో 1100 కేసులు నమోదు కాగా, వాటిలో 90% కేసులు ఒమిక్రాన్ వే ఉన్నాయని తేలింది. ఇజ్రాయెల్, ఇటలీ, బెల్జియం, చెక్ రిపబ్లిక్ లో ఒక్కో కేసు నమోదయ్యాయి. జర్మనీ, డెన్మార్క్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, కెనడాలో 2 చొప్పున, బోట్స్ వానాలో 19,  నెదర్లాండ్స్ లో 13 ఒమిక్రాన్ కేసులు కన్ఫామ్ అయ్యాయి.  

డేంజర్ కాదని చెప్పలేం: యాంజెలిక్ కోట్జీ 

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన పేషెంట్లకు తీవ్రమైన అలసట, స్వల్పంగా కండరాల నొప్పులు, గొంతు గరగర, పొడి దగ్గు వంటి సింప్టమ్స్ కన్పిస్తున్నాయని ఈ వేరియంట్ గురించి మొట్టమొదటగా సౌత్ ఆఫ్రికన్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ యాంజెలిక్ కోట్జీ వెల్లడించారు. అతికొద్ది మందికి మాత్రమే టెంపరేచర్ భారీగా పెరుగుతోందన్నారు. డెల్టా కరోనా, ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ సోకేవాళ్లలో డిఫరెంట్ సింప్టమ్స్ కన్పిస్తున్నాయని చెప్పారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, స్మెల్, టేస్ట్ పోవడం వంటి సింప్టమ్స్ కన్పించడంలేదన్నారు. గత పదిరోజుల్లో ఒమిక్రాన్ సోకిన 30 మంది పేషెంట్లను తాను చూశానని, వీరంతా ఇండ్లలోనే కోలుకున్నారని తెలిపారు. అయితే ఒమిక్రాన్ తో మున్ముందు భారీ ప్రమాదం ఉండదని చెప్పలేమన్నారు. 

డెల్టా కన్నా ఒమిక్రాన్ మేలు: మార్క్ వాన్ రాస్ట్  

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్​వే ఉంటున్నాయి. మొదట మన దేశంలో పుట్టిన డెల్టా వైరస్ ఆ తర్వాత తీవ్రమైన సింప్టమ్స్, మరణాలతో ప్రపంచాన్నంతా వణికించింది. అయితే, డెల్టా కన్నా స్పీడ్ గా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ తో సింప్టమ్స్ స్వల్పంగా ఉండటం, డెల్టా అంత ప్రాణాంతకం కాకపోవడం వంటివి పాజిటివ్ అంశాలేనని బెల్జియన్ వైరాలజిస్ట్ డాక్టర్ మార్క్ వాన్ రాస్ట్ అంటున్నారు. 

కర్నాటకలో అనుమానిత కేసు  

దక్షిణ ఆఫ్రికా నుంచి కర్నాటకకు వచ్చిన 63 ఏండ్ల వ్యక్తికీ కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే అతనికి సోకింది డెల్టా వేరియంట్ కాదని, డిఫరెంట్ వేరియంట్ అని రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సుధాకర్ వెల్లడించారు. కేంద్ర హెల్త్ మినిస్ట్రీ, ఐసీఎంఆర్ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని అన్నారు.

మహారాష్ట్రలో ఒకరి ఐసోలేషన్ 

సౌత్ ఆఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలీ టౌన్​కు వచ్చిన 32 ఏండ్ల మర్చంట్ నేవీ ఇంజనీర్​కు కరోనా పాజిటివ్ గా తేలడంతో అధికారులు అతన్ని ఐసోలేషన్​లో ఉంచారు. అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అన్నది తేల్చేందుకు శాంపిల్​ను జీనోమ్ సీక్వెన్సింగ్​కు పంపినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. రిజల్ట్ 7 రోజుల తర్వాతే తెలుస్తుందని చెప్పారు.