ఆ టేస్టే వేరు : ఈ పానీపూరి తింటే మల్ల రావాలె..!

ఆ టేస్టే వేరు : ఈ పానీపూరి తింటే మల్ల రావాలె..!

పానీపూరి.. ఈ పేరు చెబితే నోట్లో నీళ్లూ రుతయ్. పానీపూరిలో ఉడకబెట్టిన బఠానీ వేసి జెరంత ఉల్లిగడ్డేసి, పుల్లపుల్లటి నీళ్లల్ల ముంచి గబుక్కున నోట్లో కుక్కి నమిలి మింగుతుంటే.. ఆ టేస్ట్​ తగిలి జిహ్వ.. వాహ్వా.. అనాల్సిందే. ఒక్కొక్కరికి ఒక్కో పానీపూరి అడ్డా ఉంటుంది. ఏరియాని బట్టి పానీపూరి బండికి గిరాకీ ఉంటుంది. కానీ..హైదరాబాద్ కాచిగూడలోని నింబోలి అడ్డాలో ఉన్న మహంకాళి గుడి దగ్గర ఉండే భగవతి పానీపూరి మాత్రం పట్నంలో అన్నింటికంటే స్పెషల్ . ఇక్కడ ఒక్కసారి పానీపూరి, రగడ తింటే.. మళ్లీ మళ్లీ రావాల్సిందే!

సమయం.. సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు..కాచిగూడ నుంచి నింబోలి అడ్డా రూట్ ..రోడ్డు పక్కనే మహంకాళి అమ్మవారి గుడి. మైకులోంచి చిన్న సౌండుతో.. ‘ఆషాఢ మాసమొచ్చె.. అమ్మవారి జాతరొచ్చె..తొలకరి పలకరించె .. పుడమితల్లి పులకరించె .. మమ్ములను చల్లగ చూడమ్మో మాంకాళి.. పాడి పంటలియ్యవమ్మో మాంకాళి’ అని అమ్మవారి బోనాల పాట వస్తుంది. అంతకు ముందు నుంచే అక్కడ నలుగురు కుర్రాళ్లు గుడి పక్కనే మూసేసి ఉన్న ఓ చిన్న షట్టర్ ముందు నిలబడి ఉన్నారు. ఇంతలో పాతికేళ్ల యువకుడు స్కూటీ మీద వచ్చి జేబులోంచి తాళంచెవి తీసి ఆ షట్టర్ ఓపెన్ చేశాడు. ఐదు నిమిషాల తర్వాత అరవయ్యేళ్లు పైబడ్డ ఓ పెద్దమ్మ వచ్చింది. ఆమె పేరు భగవతి. ఆ యువకుడు ఆమె కొడుకు.. రాజేశ్వర్ . భగవతి నేరుగా షట్టర్ లోకి వెళ్లిపోయి చింతపండు రసం కలపడం, ఉడకబెట్టిన బఠానీ, శెనగలు ఒక గిన్నెలోకి తీసే పనిలో మునిగిపోయింది.

ఆమె వెనకాలే ఇద్దరు కుర్రాళ్లు లూనా మీద రెండు వైపులా తెల్లటి సంచుల్లో పానీపూరీ ప్యాకెట్లు, ఇంకా ఏవో ప్యాకెట్లు తీసుకొచ్చి ఆ షట్టర్ ముందు బండి ఆపారు. ఒక్కొక్కటిగా లూనా మీద నుంచి సంచులు షట్టర్లో పెట్టారు. ఆ కుర్రాళ్లు సంచులు లోపల పెట్టి, రెండు జాడీల్లో వాటర్ బబుల్ నుంచి సగం వరకు నీళ్లు నింపారు. మిగతా సగం ఆమె కలిపి ఇచ్చిన చింతపండు రసంతో నింపారు. భగవతి పానీపూరి ప్యాకెట్ ఓపెన్ చేసి ఓ బేసిన్ గిన్నెలో నింపింది. అందులోంచి

ఒక పానీపూరి తీసుకొని అందులో బఠానీ, శెనగలు నింపి దేవునికి మొక్కి పక్కకు పెట్టింది. అప్పటి దాకా వెయిట్ చేసిన నలుగురు కుర్రాళ్లు.. చిన్న టేబుల్ మీద కూర్చున్న రాజేశ్వర్ దగ్గరికి వెళ్లి తలా ఓ కప్పు తీసుకొని పానీపూరి తినడం మొదలుపెట్టారు. తలా.. ఇరవై రూపాయల పానీపూరి తిని, డబ్బులిచ్చేసి వెళ్లిపోయారు. చూస్తుండగానే.. అక్కడ రద్దీ పెరిగింది. పది, ఇరవై, ముప్పై ఇలా గుంపు గు పుగా పానీపూరి కోసం జనం ఎగబడుతున్నారు. అర్జెంటు పని మీద

వెళ్తున్న ఓ జంట అక్కడ ఆగింది. ‘ఈడ రగడ మస్తుంటది బావా.. తినిపోదాం ’ అని భార్య, భర్తని ప్రేమగా అడిగింది. అంత ప్రేమగా అడిగితే ఎవరు కాదంటారు. ఆయన బండి పక్కకు పార్క్​ చేసి.. వెళ్లి ‘అమ్మా.. దో రగడ బనావో’ అని ఆర్డరిచ్చాడు. ఆర్డరిచ్చింది ఎవరో చూడకుండానే..‘పదిహేను నిమిషాలు టైమ్ పడుతది సార్..’అని సమాధానమిచ్చిం ది భగవతి. ‘అరే..అర్జంటుగా పోయేదుందమ్మా.. ఫస్టైతే నాకియ్యి’ అన్నడాయన. ‘అర్జెంటుంటే..ఎల్లుర్రి సార్ .. ఈడ శానసేపటి నుంచి మంది లైన్ల నిలవడ్డరు. ఆళ్లను కాదని నీకెట్ల ఇయ్యాలె.. పద్ధతి కాదు కద సారూ..’అన్నది భగవతి తలెత్తకుండానే. ‘అరే..లేటయేటట్టుందే.. మల్లొచ్చే టప్పుడు తిందాం పా..’ అన్నడు ఆయన భార్యను చూస్తూ. ‘మల్లొచ్చేటప్పటికి ఇది ఉండదు. బందయితది. పది నిమిషాలు లైన్ల నిలవడితే.. ఇస్తది. ఏం కాదు.. ప్లీజ్ బావా’అని అడిగిందామె. సరే..అని పోయి లైన్లో నిల్చున్నడాయన. చూస్తుండగానే.. టైమ్ ఆరున్నర అయింది. అప్పటి దాకా ఎవరు

ఎన్ని గప్ చుప్ లు అడిగినా ఇచ్చిన భగవతి కొడుకు రాజేశ్వర్ .. టైమ్ దిక్కు చూశాడు. టైమ్ ఆరున్నర అయింది. గప్ చుప్ ల సంచి వైపు చూశాడు. నాలుగు సంచుల్లో మూడు ఖాళీ అయినయ్ . ఇంకా ఒకటే ఉంది. ఇంతలో ఓ కస్టమర్ .. ‘అన్నా .. బీస్ కా గప్ చుప్ దాలో’ అన్నాడు . ‘అన్నా.. ఓన్లీ..పదిరూపాయలవే.. ఏస్త. పానీపూరీ దగ్గర పడ్డయ్. ఇంకా మస్తు లైన్ల ఉన్నరు. అందరికీ రావాలె గదా ’ అన్నడు రాజేశ్వర్.

టైమ్ ఏడు గంటల పదినిమిషాలు.. ఇంకా కస్టమర్లు వస్తూనే ఉన్నరు. అయిపోతయేమో అని ఆగమాగం వచ్చి లైన్లో నిలబడుతున్నరు. అక్కడ ఉన్న అందరూ ఇంకా తిననే లేదు. పానీపూరి అయిపోయింది.. ఉడకబెట్టి తీసుకొచ్చిన పానీపూరి స్టఫ్ కూడా అయిపోయింది. ‘సార్ ..లైన్ల ఉన్నోళ్లం దరూ.. ఏం అనుకోకుర్రి. ఇయ్యాల అయిపోయినయ్ . టైమ్ కూడా ఒడిశింది. ఇగ రేపే’ అనుకుంట వచ్చినప్పటి నుంచి పనిలో మునిగిపోయిన భగవతి గిన్నెలు పక్కకు పెట్టి అందర్ని చూసుకుంట చెప్పింది. ‘అరే.. ఇరవై నిమిషాలు లైన్ల నిలబడ్డ..అయిపోయినయ్ అంటే ఎట్లమ్ మా?’ ఓ

కస్టమర్ కయ్యిమన్నడు భగవతి మీదికి. ‘మస్తు దూరంకెల్లి వచ్చినం.. కనీసం చెరి పదిరూపాయల పానీపూరి అయినా

వెయ్యరాదమ్మా’ అని దోస్తుతో కలిసి వచ్చిన ఓ అమ్మాయి రిక్వెస్ట్ . కానీ.. భగవతి చెప్పేది ఒకే మాట.. ‘ఐదున్నరకి దుకాణం ఓపెన్ అయితది. ఏడున్నరకు బంజేస్త. ఈ లోపట పానీపూరి అయిపోతే.. ఏడుగంటలకే బంజేస్త. ఎక్వతక్వ అమ్మను. టైమంటే.. టైమ్. పైసల కోసమే అమ్మాలంటే.. ఎక్కడెక్కడి నుంచో దేవులాడుకుంట నా దగ్గరకి రావాల్సిన అవసరం లేదు గద సారూ’ అనుకుంటూ గిన్నెలు కడగడం మొదలుపెట్టింది. ఎంతో ఆశతో భగవతి చేతి పానీపూరి తినాలని వచ్చిన వాళ్లు తినాలన్న కోరికను రేపటికి వాయిదా వేసుకొని తిరుగుముఖం పట్టారు.

నా చిన్నప్పటి నుంచి..

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్ కి పోయి రాంగనె.. వచ్చి దుకాణంల కూసునెటోన్ని. గప్ చుప్ లు వేయడం, అమ్మకు సాయం చేయడం, శెనగలు, బఠాణీ కలపడం చేసేవాణ్ణి. ఒక్కోసారి పానీపూరి సరిపోవు. చాలామంది తిరిగి వెళ్లిపోతారు. మొదట్లో నాకు అర్థం కాకపోయేది.. ఇంత గిరాకీ ఎందుకొచ్చేదో.. అదంతా మా అమ్మ చేసే పానీపూరి మసాలా స్పెషల్ అని. తెలిసాడే భగవతి కొడుకు రాజేశ్వర్ గౌడ్.

పైసల కోసం కాదు..

ఎంత కష్టపడితే.. అంత డబ్బులొస్తయి. రెండు గంటలు ఎక్కువ అమ్మితే నాకే ఎక్కువ పైసలు వస్తయ్ . కానీ.. నేను పైసల కోసం చేస్తలేను. ఎక్కడెక్కడి నుంచో నా పానీపూరి కోసం వస్తరు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకే నా దుకాణం ఉంటది. ఎంత గిరాకీ ఉన్నా.. ఇదే టైమ్ మెయింటెన్ చేస్తున్న. రుచి కావాలంటే టైమ్ కి వచ్చి తినాలి. నా పానీపూరి ఒక్కసారి తింటే.. మల్ల మల్ల దేవులాడుకుంట వస్తరు. ఈ

రుచి పట్నం మొత్తంల ఏడ దొర్కదని సవాల్ చేస్తున్న. ఒకప్పుడు బొంబాయ్ లో ఉండేది. ఇప్పుడు బొంబాయ్ ల కూడా దొర్కుతలేదు. – భగవతి, యజమాని