- సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నవ్యక్తే కిలో బంగారంతో ఉడాయించినట్లు గుర్తింపు
- అరెస్ట్ చేసిన పోలీసులు
పంజాగుట్ట, వెలుగు : హైదరాబాద్ పంజాగుట్టలోని జాయలుక్కాస్ షోరూంలో భారీ చోరీ వెలుగుచూసింది. షోరూంలో సేల్స్‌బాయ్‌గా పనిచేసే వ్యక్తే కిలో బంగారంతో ఉడాయించినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లాకు చెందిన కారంపూడి గోపాలకృష్ణ (25) రెండు నెలల కింద పంజాగుట్ట జాయలుక్కాస్ షోరూంలో సేల్స్‌బాయ్‌గా చేరాడు.
ఈ నెల 14న డ్యూటీ ముగిసిన తర్వాత షోరూం నుంచి వెళ్లిపోయాడు. రాత్రి షోరూం మేనేజర్ స్టాక్‌ను చెక్ చేయగా.. తేడా రావడంతో సీసీ ఫుటేజీని పరిశీలించాడు. గోపాలకృష్ణ హడావుడిగా వెళ్తున్నట్లు కనిపించడంతో అతడిపై అనుమానం వచ్చి రాత్రి 12.30 గంటలకు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు గోపాలకృష్ణ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విజయవాడ రోడ్డులో ఉన్నట్లు గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. 100 గ్రాములు బరువున్న పది బంగారు బిస్కెట్లను గోపాలకృష్ణ తన సాక్స్‌లో పెట్టుకొని వెళ్లినట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రూ. 1.65 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లతో పాటు బైక్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
