హైదరాబాద్, వెలుగు: అకౌంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్యను స్వామి వివేకానంద విశిష్ట పురస్కారం వరించింది. మదర్ ఫౌండేషన్, నవకళా వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాష్ట్ర సారస్వత పరిషత్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి ఈ అవార్డును అంజయ్యకు అందించారు.
అనాథ పిల్లలకు ఆశ్రయం, విద్యా సహాయం, ప్రమాదాల్లో ఇండ్లు కోల్పోయిన వారికి నిర్మించి ఇవ్వడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఈ సేవలను గుర్తించి మదర్ ఫౌండేషన్ సభ్యులు, నవకళా వేదిక సభ్యులు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ అవార్డు సామాజిక సేవ చేసేవారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని అంజయ్య తెలిపారు.
