- తమ వాళ్ల ఓట్లే ఉంచుకునే కుట్ర: ప్రొఫెసర్ నాగేశ్వర్
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై ‘ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)’ పేరుతో పాలకులు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. ఓటు లేనివారిని కనీసం పౌరులుగా కూడా గుర్తించని పరిస్థితి వస్తుందని, ఇది పౌరసత్వాన్ని చంపడమేనని ఆయన మండిపడ్డారు సోమవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సర్‌పై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయ పరిస్థితులు మార్చేందుకే ‘సర్’ను ప్రవేశపెట్టారని విమర్శించారు. బిహార్‌లో 80 లక్షలు, బెంగాల్లో 90 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, యూపీలో ఏకంగా 2.83 కోట్ల ఓటర్లను తొలగించినా ఎవరూ మాట్లాడకపోవడం దారుణమన్నారు.
ఉద్దేశపూర్వకంగానే ముస్లిం, క్రైస్తవ మైనార్టీలతోపాటు ఆదివాసీ, దళితులు, పేదల ఓట్లు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఇజ్రాయెల్‌లో యూదులు కానివారు బతకకూడదనే ధోరణి ఉన్నట్లుగానే, భారత్‌లోనూ అస్మదీయులైన ఓటర్లనే ఉంచుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
ఎన్నికల్లో పోటీ చేయాలంటే రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఇందుకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సంఘటననే ఉదాహరణగా గుర్తుచేశారు. కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యులు మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘నాన్ ఆప్లికేబుల్’ పేరుతో ఓట్లను తొలగిస్తూ పౌరులను అనాథలను చేస్తున్నారన్నారు. ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన పౌరసత్వం రాదని, ఓటు హక్కు లేకపోతే ప్రభుత్వం ముందు విలువే ఉండదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు సిద్ధమవ్వాలి: కూనంనేని
సీపీఐ నేత కూనంనేని మాట్లాడుతూ ఓటు హక్కు అనే శక్తివంతమైన ఆయుధాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వలస కూలీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఓట్లపై స్పష్టత లేదని, బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా ఉండి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా చూడాలని కోరారు. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని అడ్డుకోవడానికి సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందన్నారు.
