
హైదరాబాద్: పరమహంస యోగానంద 130వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో యోగానంద ఆవిర్భావ దినోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ, గాడ్ టాక్స్ విత్ అర్జున తదితర పుస్తకాలపై 25% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా యోగానంద జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 5న జరుపుకొంటారు. పశ్చిమ దేశాల్లో యోగధ్యానానికి రాయబారి వంటి ఈ గొప్ప గురువులు దాదాపు 30 ఏళ్ళకు పైగా సనాతన భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలను అందించడానికి అమెరికాలో ఉండిపోయారు.
యోగానంద జీవితంలో, ఆయన వ్యక్తిత్వంలో ప్రతిఫలించిన స్వచ్ఛమైన ప్రేమ, శాంతి, మరియు ఆనందంతో ప్రభావితులైన అనేక మంది అనంతాన్ని చేరుకోవడానికి ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తున్నారు. యోగానంద మూర్తీభవించిన ప్రేమస్వరూపులు కావడం వల్ల ‘ప్రేమావతారులు’గా నేటికీ పిలవబడుతున్నారు.
యోగానంద శిష్యులైన వారిలో లూథర్ బర్బాంక్, అమెలిటా గల్లి-కుర్చి వంటి ప్రముఖ వ్యక్తులు ఉండగా, గురుదేవుల దేహత్యాగం తరువాత ఆయన బోధలకు గాఢంగా ప్రభావితులైన వారిలో ఎందరికో ఆరాధ్యులైన జార్జ్ హారిసన్, పండిత రవిశంకర్, స్టీవ్ జాబ్స్ వంటి వారున్నారు.
ఈ భూమిపై యోగానంద జీవన ప్రమాణం కొద్ది దశాబ్దాలకే పరిమితమయినా, ఆయన యొక్క ఏకాగ్ర దైవకేంద్రిత జీవనం వల్ల జనించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు నేటికి మహాసాగరంవలె అయ్యాయి. ఆయన బోధనలు శ్రద్ధగా అనుసరించే శిష్యులు ఈ జీవితంలోనూ, మరణానంతరమూ కూడా గొప్ప భాగ్యశాలురవుతారు.