గిర్నార్ పర్వతం చుట్టూ పారామోటార్‌‌తో నిఘా

గిర్నార్ పర్వతం చుట్టూ పారామోటార్‌‌తో నిఘా
  • గుజరాత్‌‌ పోలీసుల వినూత్న ప్రయత్నం.. వీడియో వైరల్

గాంధీనగర్: గుజరాత్‌‌ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే జునాగఢ్‌‌లోని ఐదు రోజుల 'లిలి పరిక్రమ'ను పర్యవేక్షించడానికి పారామోటార్‌‌ను పారాగ్లైడర్ లాగా ఉపయోగిస్తున్నారు. దాని సాయంతో గాలిలోకి ఎగిరి గిర్నార్ పర్వతం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

గిర్నార్ పర్వతం హిమాలయాల కంటే పురాతనమైనది. దీని చుట్టూ వందల సంఖ్యలో హిందూ, జైనా దేవాలయాలు ఉన్నాయి.  మహాభారతంలోనూ  ఇది పవిత్ర స్థలంగా పేర్కొన్నారు. గుజరాతీ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా గిర్నార్  పరిక్రమ జరుగుతుంది. పచ్చదనంతో నిండి ఉన్న ఈ పరిక్రమ మొత్తం మార్గం 36 కి.మీ. కాగా..దాన్ని చుట్టి రావడానికి యువకులకు ఒక రోజు పడుతుంది. వృద్ధులకు 2 రోజులు పడుతుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది 'లిలి పరిక్రమ'లో పాల్గొంటారు. 

 భక్తులు లక్షల సంఖ్యలో వస్తుండటంతో నిఘా ఏర్పాట్లు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో నిఘా కోసం పారామోటర్‌‌ను ఉపయోగిస్తున్నారు. ఓ పారామోటార్‌‌ గిర్నార్ పర్వతం చుట్టూ చక్కర్లు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఇంప్లిమెంటేషన్ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం డ్రోన్‌‌లను కూడా ఉపయోగించాలని సూచించారు.