కూతురి జీవితాన్ని సర్వ నాశనం చేసిన తల్లిదండ్రులు

కూతురి జీవితాన్ని సర్వ నాశనం చేసిన తల్లిదండ్రులు

పిల్లల భవిష్యత్తు పాడుకాకూడదని తల్లి దండ్రులు మంచి చదువులు చదివిస్తారు. కూతురు పెద్దయ్యాక చదువు, జాబ్ ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. ఎలాంటి కష్టం రాకూడదని కోరుకుంటారు. కానీ సంగారెడ్డి జిల్లాలో తల్లిదండ్రులు కూతురిపై వ్యవహారించిన తీరు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టుమని 16 సంవత్సరాలు లేని కూతురికి అంతకుముందే పెళ్లి అయిన వ్యక్తికిచ్చి పెళ్లి చేయబోయారు. అయితే 10వ క్లాస్ పాసైన ఆ అమ్మాయి టీచర్లు, అధికారుల సాయంతో పెళ్లి నుంచి బయటపడింది. మహిళా, శిశు సంక్షేమ విభాగాధికారులకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి ఆపారు. ఆ తర్వాత కొన్ని రోజుల గడిచాక తల్లిదండ్రుల ఆలోచన మారింది. కూతురు ప్రెగ్నెంట్ అయితే చచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటుందని ప్లాన్ వేశారు. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డ తల్లిదండ్రులు కూతురితో బలవంతంగా పెళ్లైన వ్యక్తితో కాపురం చేయించారు.

ఇలా  10 సార్లకుపైగా భరించిన ఆ బాలిక.. చివరకు ఇంట్లో చెప్పకుండా బంధువుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల తీరును చెప్పుకుని కన్నీరుమున్నీరయ్యింది. కష్టం వస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటాం..అలాంటిది కన్న తల్లిదండ్రులే కష్టాలు పెడితే ఎవ్వరికీ చెప్పుకునేది అని బోరున విలపించిందని చెప్పారు బాలిక బంధువులు. ఆమె కష్టం చూడలేక మళ్లీ అధికారులను ఆశ్రయించారు బాలిక బంధువులు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు బాలికకు బాలసదనంలో ఆశ్రయం కల్పించారు. ఇటీవల అక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారిణి ఒకరు.. చిన్నారి బలహీనంగా ఉండటాన్ని గుర్తించి వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు.

పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. దీంతో ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి అనుమతి తీసుకుని ఆమెకు  అబార్షన్‌ చేయించారు. బాధ్యుడైన వ్యక్తితో పాటు బాలిక కుటుంబానికి చెందిన నలుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశారు.  బాలిక పేరు బయటికి రాకుండా పోలీసులు గ్రామం, అసలు పేరు గోప్యంగా ఉంచారు. బాలిక జీవితాన్ని నాశనం చేసినవారిని కఠినంగా శిక్షించాలని పలువురు సీరియస్ అవుతున్నారు.