పిల్లల రాకతో సంతోషంలో తల్లిదండ్రులు

పిల్లల రాకతో సంతోషంలో తల్లిదండ్రులు
  • స్వీట్లు తినిపించుకుంటూ ఇండ్లల్లో సంబురాలు
  • ఇంకా ఉక్రెయిన్​లోనే మరికొందరు స్టూడెంట్స్
  • మారుతున్న పరిస్థితులు చూసి ఆందోళనలో పేరెంట్స్

హైదరాబాద్, వెలుగు: ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన 37 మంది తెలంగాణ స్టూడెంట్స్ ఆదివారం రెండు ఫ్లైట్లలో సిటీకి చేరుకున్నారు. ఉదయం ముంబై నుంచి 15 మంది, సాయంత్రం ఢిల్లీ నుంచి 22 మంది వేర్వేరు ఫ్లైట్లలో శంషాబాద్​ఎయిర్​పోర్టుకు రీచ్​అయ్యారు. వారిలో ఎక్కువ మంది సిటీకి చెందిన వారే ఉన్నారు. క్షేమంగా తిరిగి వచ్చిన పిల్లలను చూసి తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. బిడ్డలను మళ్లీ చూస్తామనుకోలేదని, సేఫ్​గా తిరిగి రావడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇండియన్ ఎంబసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు థ్యాంక్స్​చెప్పారు. సిటీకి చేరుకున్న వారిలో కుత్బుల్లాపూర్, మీర్ పేట, లింగంపల్లి, మియాపూర్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాబాద్, కాళీమందిర్, మేడ్చల్, మౌలాలి, ఎర్రగడ్డ, మోతీనగర్, ఇతర ప్రాంతాలకు చెందిన స్టూడెంట్స్​ఉన్నారు. ఇళ్లకు చేరుకున్నాక పిల్లల పేరెంట్స్​బంధువులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. సంతోషంలో స్వీట్స్​పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఇంకా ఉక్రెయిన్​లోనే చిక్కుకుని ఉన్న పిల్లల గురించి పేరెంట్స్​ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్​లో పరిస్థితులను ఎప్పటికప్పుడు టీవీలు, సోషల్​మీడియాలో చూసి భయంతో వణికిపోతున్నారు. పరిస్థితి మరింత దిగజారక ముందే ఏదోక విధంగా తమ పిల్లలను తీసుకురావాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. 

వార్ స్టార్ట్​ అవ్వగానే..

వార్​స్టార్ట్ అయ్యినప్పటి నుంచి ఉక్రెయిన్​లో బిక్కుబిక్కుమంటూ గడిపిన పిల్లలు ఇంటికి చేరుకోవడంతో పేరెంట్స్ ఆనందంలో మునిగిపోయారు. స్వీట్స్​పంచుకున్నారు. తమ బంధుమిత్రులకు ఫోన్లు చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అక్కడ పిల్లలు ఫేస్​చేసిన ప్రాబ్లమ్స్​గురించి మాట్లాడుకున్నారు. తాము వెస్ట్రన్ ఉక్రెయిన్ లోని చెర్నివిస్టీ ప్రాంతంలో ఉన్నామని, అక్కడ ఎలాంటి బ్లాస్టింగ్ జరగకపోవడంతో సేఫ్​గా ఉండగలిగామని కుత్బుల్లాపూర్​కి చెందిన మెడికో స్టూడెంట్ దీప్తి చెప్పింది. వార్ స్టార్ట్ కాగానే ఎంబసీ తమని అల్టర్ చేసిందని వివరించింది. బార్డర్​కి దగ్గర్లో ఉండటంతో తాము త్వరగా రాగలిగామని, తామున్న హాస్టల్​కి తమ యూనివర్సిటీతోపాటు ఇండియన్ ఎంబసీ బస్సు అరేంజ్ చేసిందని అందులో తాము రొమేనియా బార్డర్ చేరుకున్నామని తెలిపింది. అక్కడి నుంచి రొమేనియా ఎయిర్ పోర్టుకు వెళ్లి ఫ్లైట్ లో ఇండియాకు రీచ్ అయ్యామని వివరించింది. తమ పాప ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మాపూర్​కి చెందిన స్టూడెంట్ తండ్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అక్కడే చిక్కుకుపోయిన పిల్లలను కూడా ప్రభుత్వాలు త్వరగా తీసుకురావాలని కోరారు. 

భయం భయంగా.. 

యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో చిక్కుకున్న తమ పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేంద్రం ప్రత్యేక విమానాల ద్వారా తమ పిల్లలను ఇండియాకి తీసుకురావాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం కీవ్, ఖార్కివ్ ప్రాంతాల్లో భయానకమైన పరిస్థితులున్నాయని తెలుసుకుని తల్లడిల్లుతున్నారు. అక్కడి ప్రభుత్వం సోమవారం సాయంత్రం వరకు కీవ్, ఖార్కివ్ సిటీల్లో కర్ఫ్యూ విధించిందని, అపార్ట్​మెంట్ల నుంచి బయటికి రావొద్దని ఆదేశించిందని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. సికింబ్రాద్​కి చెందిన మెడికో స్టూడెంట్ తమ పరిస్థితి భయానకంగా ఉందని, అసలు బయటకు రాలేని పరిస్థితి ఉందని శనివారం అర్ధరాత్రి తల్లిదండ్రులకు మెసేజ్ చేసింది. 

ఇండియన్​ ఎంబసీ హెల్ప్​తోనే..

మేం చెర్నివిస్ట్​లోని మా హాస్టల్​లోనే ఉన్నాం. బార్డర్​కి దగ్గర ఉండటం వల్ల సేఫ్​గా ఉన్నాం. ఇండియన్ ఎంబసీ మాకు చాలా హెల్ప్ చేసింది.  ఎప్పటికప్పుడు మెయిల్స్ పంపించారు. వాటికి తగినట్టు మేం ఫాలో అయ్యాం. పేరెంట్స్ వర్రీ కావడంతో మేము ఒత్తిడి గురయ్యాం. మొదట్లో ఫ్లైట్​ టికెట్స్ బుక్ చేద్దామనుకుంటే టికెట్ల కాస్ట్​పెరిగిపోయాయి. మనీ కట్ అయ్యాయి కానీ మళ్లీ రాలేదు. మా యూనివర్సిటీలో తెలుగు వాళ్లం 340 మంది వరకు ఉంటాం. అక్కడే ఇరుక్కుపోతామని అనుకున్నాం. ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది.    

-  సుప్రియ, స్టూడెంట్, శేరిలింగంపల్లి

ఎయిర్ పోర్టుకు చేరుకుని.. 

మా అమ్మాయి నిషారాణి మరికొందరు ఇండియన్ స్టూడెంట్స్ శనివారం ఉదయం విన్నిట్సియా నుంచి స్టార్ట్​ అయ్యి రొమేనియా బార్డర్​కు చేరుకున్నారు.  అక్కడ సాయంత్రం వరకు చలిలో చెకింగ్ కోసం వెయిట్ చేశారు. సాయంత్రం ఇండియన్ ఎంబసీ అరేంజ్ చేసిన బస్సులో ఎయిర్ పోర్టుకి బయల్దేరారు. ఆదివారం సాయంత్రం రొమేనియాలోని బుచరెస్ట్ ఎయిర్ పోర్టుకు రీచ్ అయ్యారు.

- అనంతయ్య, నిషారాణి తండ్రి, శంషాబాద్

ప్లీజ్ మా బిడ్డని ఇంటికి చేర్చండి

బార్డర్లకు దగ్గర్లో ఉన్న పిల్లలను ఇండియాకు తరలిస్తున్నారు. మరి యుద్ధం జరుగుతున్న ప్లేస్ లో మా అమ్మాయిలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? అక్కడ బంకర్లలో ఉండలేక, ఎప్పుడేం అవుతుందో అని టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. మేం విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. కీవ్​లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఏం అర్థం కావట్లేదు. దయచేసి మా అమ్మాయితోపాటు అక్కడున్న స్టూడెంట్స్ ని స్పెషల్ ఫ్లైట్ ద్వారా ఇండియాకి తరలించండి.

- మనోహర్ బాబు, అనీలా తండ్రి, సికింద్రాబాద్

మూణ్నెళ్ల క్రితమే వెళ్లింది

ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మా అమ్మాయి మెడికల్ కోర్స్ చేసేందుకు మూడు నెలల క్రితమే ఉక్రెయిన్ వెళ్లింది. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. తన పరిస్థితి ఎలా ఉందో అని కాళ్లు చేతులు ఆడటం లేదు. భారత ప్రభుత్వం వీలైనంత త్వరగా పాపను ఇండియాకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. 

- సునీల్, చెలిమల్ల గ్రేసీ తండ్రి, మారుతీనగర్