- తాండూర్, దండేపల్లిలో ప్రారంభించిన కలెక్టర్
 - జిల్లాలో మూడు సెంటర్లలో సీసీఐ పత్తి కొనుగోళ్లు
 - తేమ 8 నుంచి 12 శాతం లోపు ఉంటేనే ఎమ్మెస్పీ
 - ఫస్ట్ డే 60 క్వింటాళ్లు మాత్రమే తీసుకొచ్చిన రైతులు
 - రంగు మారిన పత్తిని రిజెక్ట్ చేసిన సీసీఐ
 
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ ఆధ్వర్యంలో తాండూర్, లక్సెట్టిపేట, చెన్నూర్‌లో మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్పరిధి తాండూర్లోని మహేశ్వరి కాటన్‌మిల్లు, లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్పరిధిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో కొనుగోళ్లను ప్రారంభించారు. రైతులు కిసాన్ కపాస్ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసి పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం తేమ శాతం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు.
ఆధార్ నంబర్‌కు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ద్వారానే చెల్లింపులు జరుగుతాయన్నారు. క్రాప్ బుకింగ్‌లో నమోదైన రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తామని.. ఏవోలు, ఏఈవోలు డీఏవో సమన్వయంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళారులు తీసుకొచ్చే పత్తిని సెంటర్లలో కొనుగోలుకు అనుమతించొద్దన్నారు. ఈసారి ఎల్1, ఎల్2, ఎల్3 స్థాయిల్లో స్లాట్బుకింగ్చేసి, ప్రతి స్థాయిలో 75 శాతం స్లాట్లు బుక్ అయిన తర్వాతే కొనుగోళ్లు జరుగుతాయన్నారు.
పత్తి కొనుగోలు చేసే మిల్లులివే..
జిల్లాలో నియోజకవర్గానికి ఒకటిచొప్పున మూడు సెంటర్లను ఏర్పాటు చేయగా.. మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి దండేపల్లిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లు, చెన్నూర్‌కు సంబంధించి చెన్నూర్ కాటన్ కంపెనీ, జీఆర్ఆర్ ఇండస్ట్రీస్, నవదుర్గ కాటన్‌మిల్లు, శ్రీ ఆదిశంకరాచార్య కాటన్ అండ్ ఆయిల్ మిల్లు, వరలక్ష్మి ఇండస్ట్రీస్, ఇందారంలోని బాలాజీ కాటన్ జిన్నింగ్‌మిల్లులో పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి తాండూర్లోని శ్రీరామ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లు, మహేశ్వర కాటన్ మిల్లు, వైభవ్ఫైబర్, కన్నెపల్లిలోని ఆదినాథ్కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లు చేపడుతారు. కాగా, సోమవారం తాండూర్‌లో 60 క్వింటాళ్ల పత్తి మాత్రమే విక్రయానికి వచ్చింది. రంగు మారిన పత్తిని సీసీఐ అధికారులు రిజెక్ట్ చేశారు.
8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే..
సీసీఐ రూల్స్ ప్రకారం పత్తిలో 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోళ్లు చేయనున్నారు. 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.8,110, 9 శాతానికి రూ.8,028, 10 శాతానికి రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,866, 12 శాతానికి రూ.7,785 చొప్పున చెల్లిస్తారు.
12 కంటే ఎక్కువగా తేమ ఉంటే రైతులు తమ పత్తిని ప్రైవేటులో అమ్ముకోవాల్సిందే. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి చేనులు కుదేలయ్యాయి. మొక్కలపై పత్తి తడిసిపోయిన రంగు మారి క్వాలిటీ దెబ్బతిన్నది. ఇలాంటి పత్తిని సీసీఐ సెంటర్లలో కొనుగోలు చేయబోమని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. రైతులు సీసీఐ రూల్స్ పాటిస్తూ పత్తిని విక్రయానికి తీసుకురావాలని సూచిస్తున్నారు.
పత్తి పంటను దెబ్బతీసిన వర్షాలు
ఈ ఏడాది భారీ వర్షాలు పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో కాటన్ సాగైంది. సీజన్ ప్రారంభంలో వానలు లేక పత్తి చేనులు ఎండిపోగా, ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు అన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. సాధారణ దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. ఈసారి ఐదారు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలకు తడిసిన పత్తి రంగు మారి, క్వాలిటీ దెబ్బతినడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కడం గగనమే. తమ రెక్కల కష్టం వృథా అవుతోందని, పెట్టుబడులు సైతం చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
