ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్! చేవెళ్ల ఘటనతో చర్చనీయాంశంగా మారిన వైనం

ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్! చేవెళ్ల ఘటనతో చర్చనీయాంశంగా మారిన వైనం
  • 70 శాతం  రోడ్డు ప్రమాదాలు ఇక్కడే.. రాష్ట్రంలో మొత్తం 
  • 930 స్పాట్స్ గుర్తింపు 
  •     రిపేర్లకు 300 కోట్లు కేటాయించినా పనుల్లో జాప్యం
  •     రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ఫోకస్! 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ రోడ్లపై ఉన్న బ్లాక్​ స్పాట్స్(ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం) ​ప్రాణాంతకంగా మారాయి. బ్లాక్ ​స్పాట్స్​ దగ్గరే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన ఆర్టీసీ రోడ్డు ప్రమాదం 19 మందిని బలిగొన్నది. 

మూలమలుపు దగ్గరున్న గుంతను తప్పించబోయిన టిప్పర్ ​కంట్రోల్ తప్పడంతో ​ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. దీంతో మరోసారి బ్లాక్​ స్పాట్స్​పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్​ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,333 రోడ్డు ప్రమాదాలు జరగగా, అందులో 2,702 మృతి చెందారు. ఇందులో 70 శాతం వరకు బ్లాక్ స్పాట్ల వద్దే ప్రమాదాలు నమోదైనట్లు పోలీస్​ రికార్డులను బట్టి తెలుస్తోంది.

రాష్ట్రంలో 930 బ్లాక్ స్పాట్స్  

ఇంజినీరింగ్​ పరిభాషలో బ్లాక్ స్పాట్ అంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం. రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే మూలమలుపులు, జంక్షన్లు, తరుచూ పాడయ్యే  ఏరియాలను,  రోడ్డు లోపాలు (పిత్‌‌‌‌హోల్స్)  బ్లాక్​ స్పాట్స్​గా పిలుస్తారు.   బ్లాక్​ స్పాట్​ ఏరియా 500 మీటర్ల పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో ఇలాంటి బ్లాక్​ స్పాట్​ ఏరియాలు 930 వరకు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా నేషనల్​ హైవేలపై 640 ఉండగా.. స్టేట్​ హైవేస్​, ఇతర రోడ్లపై 290 ఉన్నట్లుగా పోలీస్​, ఆర్ అండ్​ బీ శాఖ ఇంజినీరింగ్​వర్గాలు అధికారికంగా గుర్తించాయి. హైదరాబాద్, దాని చుట్టుపక్కల 54 యూ -టర్న్ ల దగ్గర బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు.  

ముఖ్యంగా ఎన్​హెచ్​ -65 హైదరాబాద్ --– --సూర్యాపేట రహదారిపై అత్యధికంగా రోడ్డు యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పాటు రాచకొండ, సైబరాబాద్​, రంగారెడ్డి, మెదక్​, వరంగల్​ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీస్​ నివేదికలు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం ఎన్​హెచ్​ 163, హైదరాబాద్​ బీజాపూర్​ ఎన్​హెచ్, నిజామాబాద్​, జగదల్​పూర్​ ఎన్​హెచ్​-63, నెహ్రూ ఔటర్​ రింగ్ ​రోడ్డు తదితర రోడ్లపై పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 

రూ.300 కోట్లతో పనులు.. 

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్​ స్పాట్​ లను సరిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నాయి. రాష్ట్ర సర్కారు వివిధ బ్లాక్​స్పాట్లను సరిచేసేందుకు రెండేండ్ల కింద రూ.300 కోట్లను కేటాయించింది.  ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్​ను గుర్తించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

గుర్తించిన బ్లాక్​ స్పాట్​ ఏరియాలో రోడ్ల రిపేర్లు,  లైటింగ్, షార్ప్ కర్వ్ లు సరిచేయడం లాంటి పనులు చేపట్టేందుకు డీపీఆర్​లు కూడా రెడీ అయ్యాయి. కొన్నిచోట్ల పనులు మొదలైనప్పటికీ, చాలా చోట్ల ఊసేలేదు. తమిళనాడు మాదిరిగానే రాష్ట్రంలో డీపీఆర్​ ప్రకారం.. రూ.900 కోట్లతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీటీవీలు, స్పీడ్ కంట్రోల్ పద్ధతులు, రహదారి విస్తరణ లాంటి పరిష్కారాలను చేపట్టడానికి సిద్ధమైనట్లు ఆర్​ అండ్​ బీ శాఖ ఇంజినీర్లు చెప్తున్నారు. అయితే, ఇది ఎప్పటికీ పూర్తవుతుందో అంతుచిక్కని పరిస్థితి.