- నేపాల్లో ఏం జరిగిందో చూసినం కదా?
 - సోషల్ మీడియాపై నిషేధం విధించినందుకు ప్రభుత్వమే కూలింది: సుప్రీంకోర్టు
 - అయితే, పోర్నోగ్రఫీని తాము సపోర్ట్ చేయడంలేదని కామెంట్
 
న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక కామెంట్లు చేశారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించిన నేపాల్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రపంచం మొత్తం చూస్తున్నదని తెలిపారు. జెన్ జెడ్ నిరసనలతో అక్కడి ప్రభుత్వమే కుప్పకూలిందని గుర్తు చేశారు. పోర్నోగ్రఫీపై ఇప్పటికిప్పుడు బ్యాన్ విధించలేమని స్పష్టం చేశారు.
పోర్నోగ్రఫీని నిషేధించడం లేదా ఆన్‌లైన్ కంటెంట్‌పై ఆంక్షలు విధించడం వల్ల కలిగే పరిణామాలను ప్రస్తావిస్తూ.. సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కే.వినోద్ చంద్రన్‌తో కూడిన బెంచ్.. నేపాల్లో నెలకొన్న పరిస్థితులను ఉదహరించింది. ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ సైట్ల ఎంట్రీని పరిమితం చేసేలా దేశవ్యాప్త మెకానిజం ఏర్పాటు చేయాలని, పోర్న్ మెటీరియల్‌పై బ్యాన్ విధించాలని, ఆన్‌లైన్ కంటెంట్‌ను రెగ్యులేట్ చేయాలని కోరుతూ ఈ మేరకు సోషల్ యాక్టివిస్ట్ బీఎల్ జైన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. ‘‘పోర్నోగ్రఫీకి సపోర్ట్ చేయడం లేదు. కానీ.. ఇప్పటికిప్పుడు బ్యాన్ విధించలేం’’ అని తెలిపారు. తదుపరి విచారణను 23కు వాయిదా వేశారు.
డిజిటల్ అరెస్ట్ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిందే..
 దేశవ్యాప్తంగా ‘డిజిటల్ అరెస్టు’ మోసాలు పెరిగిపోయాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. హర్యానా అంబాలాలో  వృద్ధ దంపతుల నుంచి రూ.1.05 కోట్లు మోసం చేసిన కేసు ఆధారంగా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా  విచారించింది. ఒక్క ఇండియాలో డిజిటల్ అరెస్టు బాధితుల నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.3 వేల కోట్లు కొల్లగొట్టారని తెలిపింది. దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో చర్యలకు సిఫార్సులు చేసేందుకు సీనియర్ అడ్వకేట్ ఎన్ఎస్ నప్పినాయ్‌ను కోర్టు సహాయకుడిగా నియమించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ, రాష్ట్రాలు/యూటీలకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీలో ఏక్యూఐ స్టేషన్లు ఎందుకు పని చేయలే ? 
ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రమవడంపై సుప్రీంకోర్టు  ఆందోళన వ్యక్తం చేసింది. దీపావళి నాడు ఢిల్లీలోని మొత్తం 37 ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్(ఎక్యూఐ) మానిటరింగ్ స్టేషన్లలో 28 పని చేయకపోవడం.. కేవలం తొమ్మిది పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని వల్ల సిటీలో కాలుష్యం ఎంత  ఉందో కచ్చితంగా తెలియని పరిస్థితి ఏర్పడిందని..  కాలుష్యం తగ్గించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) చర్యలు అమలు చేయలేని పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. ఎక్యూఐ స్టేషన్లు పనిచేయకపోవడంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం), సెంట్రల్ పొల్యుషన్కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)ని నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
