పోలీసు వాహ‌నంలో పెళ్లికూతురు త‌ల్లిదండ్రులు

 పోలీసు వాహ‌నంలో పెళ్లికూతురు త‌ల్లిదండ్రులు

మహబూబ్ నగర్ :  లాక్ డౌన్ రూల్స్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్న పోలీసులు ఉద‌యం 10 దాటితే వాహ‌నాలు సీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆదివారం ఓ పెళ్లి వాహ‌నంలో లిమిట్ కు మించి 30 మంది ఉండ‌టంతో ఆ వాహ‌నాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వాహ‌నంలో పెళ్లి కూతురు త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రే పెండ్లికి అవ‌స‌ర‌మైన పుస్తెమెట్టెలు, బ‌ట్ట‌లు ఉన్నాయి. ఇది గ‌మ‌నించిన పోలీసులు మంచి మ‌న‌సు చాటుకున్నారు. రూల్స్ ప్రకారం పెండ్లి వాహ‌నాన్ని సీజ్ చేసి, పోలీసు వాహ‌నంలో పెళ్లి కూతురు త‌ల్లిదండ్రుల‌ను మండ‌పానికి తీసుకెళ్లారు. ఈ సంఘ‌ట‌న ఆదివారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో జ‌రిగింది. 

వనపర్తి జిల్లా, ఖిల్లా గణపురం మండలం, అల్లమాయపల్లికి చెందిన యువతికి మహబూబ్ న‌గ‌ర్ జిల్లా, బోయపల్లి గ్రామానికి చెందిన యువకుడితో ఆదివారం ఉదయం వివాహం జరుగాల్సి ఉంది. ఈ క్రమంలో పెండ్లి కూతురు తరపు బంధువులు ఓ వాహనంలో పెండ్లి బయల్దేరడానికి వెళ్లారు. మహబూబ్ నగర్ పట్టణంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆ వాహనంలో 30 మంది వరకు ఉండడంతో అందరినీ దించి వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే పెండ్లి తంతులో ప్రధాన భూమికను పోషించే వలసిన పెండ్లి కూతురు తల్లిదండ్రులు ఇక్కడే ఉండడం, పెండ్లికి అవసరమైన తాళిబొట్టు, తదితర సామగ్రి సైతం వీరి దగ్గరే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఐ రాజేశ్వర్ గౌడ్ పెండ్లి ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో పోలీసు వాహనంలో పెండ్లి కూతురు తల్లిదండ్రులను పంపారు. వివాహానికి ఆటంకాలు కలుగకుండా సహకరించిన సీఐకి అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.