150 మంది స్టూడెంట్స్​ను ఇండ్లకు తీసుకెళ్లిన పేరెంట్స్​ 

150 మంది స్టూడెంట్స్​ను ఇండ్లకు తీసుకెళ్లిన పేరెంట్స్​ 
  • సర్కారు నిర్లక్ష్యం వల్లే మా పిల్లలు దవాఖానాల పడ్డరు
  • బలగాల మైనారిటీ గురుకులం ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
  • అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన
  • 150 మంది స్టూడెంట్స్​ను ఇండ్లకు తీసుకెళ్లిన పేరెంట్స్​ 

ఆసిఫాబాద్ /కాగజ్ నగర్, వెలుగు : సర్కారు నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు ఫుడ్​పాయిజన్ తో   హాస్పిటల్​ పాలయ్యారని ఆరోపిస్తూ కాగజ్​నగర్​లోని బలగాల మైనారిటీ గురుకులం ఎదుట తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు. తనిఖీలకు వచ్చిన అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. సోమవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కాగా పలువురు విద్యార్థులు దవాఖానా పాలైన సంగతి తెలిసిందే. వీరి సంఖ్య మంగళవారానికి 56కు చేరింది. దీంతో అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మంగళవారం గురుకులాన్ని తనిఖీ చేయడానికి వచ్చారు. బియ్యంలో పురుగులు, మెరిగెలు కనపడడంతో సిబ్బందిని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గురుకులానికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. 

అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడడానికి ప్రయత్నించగా ఆమె ఒప్పుకోకుండా వెళ్లి కారులో కూర్చున్నారు. ఆగ్రహించిన బీజేపీ లీడర్లు, తల్లిదండ్రులు ఆమె వాహనం ఎదుట బైఠాయించారు. సర్కారు నిర్లక్ష్య వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్​ చేశారు. ప్రిన్సిపాల్, ​వార్డెన్​ను సస్పెండ్​ చేయాలన్నారు. చివరికి రూరల్ సీఐ నాగరాజు చొరవతో బీజేపీ నేతలు, పేరెంట్స్​తో అడిషనల్ కలెక్టర్  మాట్లాడారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఆందోళనలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సూచిత్, టౌన్ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు. 

ఇండ్లకు తీసుకుపోయిన తల్లిదండ్రులు

పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం అర్ధరాత్రి నుంచే హాస్పిటల్ కు రావడం మొదలుపెట్టారు. ఇలాంటి చోట తమ పిల్లలను చదివించలేమంటూ సుమారు 150 మందిని ఇండ్లకు తీసుకువెళ్లిపోయారు. ఓవైపు అడిషనల్​ కలెక్టర్ స్కూల్ లో తనిఖీ చేస్తుండగానే 50 మంది  స్టూడెంట్స్ బ్యాగులు, ట్రంక్ పెట్టెలతో ఇండ్లకు వెళ్లిపోవడం  కనిపించింది.