పిల్లలకు బండిస్తే..తండ్రికి మూడేళ్ల జైలు

పిల్లలకు బండిస్తే..తండ్రికి మూడేళ్ల జైలు

ఢిల్లీ : ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసే వారికి వాతపెట్టే మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలు ఇకపై రెట్టింపు కానున్నాయి. రూల్స్ పాటించని వారి జేబుకు ఇకపై చిల్లు పడనుంది. కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వస్తే, పిల్లలు వాహనాలు నడిపితే.. వారి తల్లిదండ్రులకు గానీ , సంరక్షకులకు గానీ 25 వేల రూపాయలతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. సంరక్షకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా క్యాన్సిల్ చేస్తారు. అత్యవసర సర్వీసులకు, అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోతే 10 వేల రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా వాహనం నడిపితే రూ.5వేలు, ర్యాష్ డ్రైవింగ్‌కు రూ.5వేలు, హెల్మెట్‌ లేకుండా బండి నడిపితే రూ.వెయ్యి ఫైన్ మాత్రమే కాకుండా మూడు నెలల పాటు లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తారు. రవాణా శాఖకు సంబంధించి ఏ ఆదేశాలనైనా ఉల్లంఘించినట్లు నిరూపితమైతే రూ.2వేలు వసూలు చేస్తారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు భారీగా ఉంటాయని కేంద్ర మంత్రి వర్గంలో తేలింది. ఆమోదం పొందిన ఈ కీలక మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.