ప్రభుత్వ స్కూళ్లలో నామమాత్రంగా పేరెంట్, టీచర్ మీటింగ్

ప్రభుత్వ స్కూళ్లలో నామమాత్రంగా పేరెంట్, టీచర్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: 
స్టూడెంట్ల అటెండెన్స్, పర్ఫామెన్స్, ఇంట్లోనూ చదువుకునే వాతావరణం కల్పించేందుకు స్కూళ్లలో పేరెంట్, టీచర్ మీటింగ్‌‌లు నిర్వహిస్తుంటారు. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్లలోనే ఎక్కువగా జరిగే ఈ మీటింగ్స్​ను.. ప్రస్తుతం సర్కార్​ స్కూళ్లలోనూ  నిర్వహించాలని ఆదేశాలున్నాయి. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రతి నెలా మూడో శనివారం లేదంటే నాలుగో శనివారం ఈ మీటింగ్స్ నిర్వహించాలని  ఆదేశాలు జారీ అయ్యాయి.  ఈ నేపథ్యంలో గత నెల నుంచి గ్రేటర్ లోని సర్కారు స్కూళ్లలో హెచ్‌‌ఎంలు వీటిని నిర్వహిస్తున్నారు. కొన్ని స్కూళ్లలో ఇవి మొదలుకాకపోగా,  నిర్వహిస్తున్న చోట 40 నుంచి 50 శాతం పేరెంట్స్ మాత్రమే హాజరవుతున్నారని హెడ్ మాస్టర్లు చెప్తున్నారు.  ప్రతి స్కూళ్లోనూ ఎస్ఎంసీ(స్కూల్ మేనేజ్‌‌మెంట్ కమిటీ) ఉంటుంది. ఇందులో తరగతుల వారీగా స్టూడెంట్ల పేరెంట్స్, ఎన్జీవో సభ్యులు, మహిళా సంఘాలకు చెందిన వారు, దాతలుంటారు. బడ్జెట్ విడుదల సమయంలో వీరితో సమావేశం ఏర్పాటు చేసుకుని స్కూల్ అవసరాలపై చర్చించుకుంటారు. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్‌‌ఎంసీ మీటింగ్స్ నిర్వహిస్తారు. ఎస్ఎంసీ మీటింగ్స్​లో తొమ్మిది, పదో తరగతి స్టూడెంట్ల పేరెంట్స్​కు భాగస్వామ్యం ఉండటం లేదని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజభాను తెలిపారు. ఎస్ఎంసీ మీటింగ్స్ ను రూల్స్ ప్రకారం నిర్వహిస్తే తొమ్మి, పదో తరగతి స్టూడెంట్ల పేరెంట్స్ కూడా ఇన్వాల్స్ అయ్యేందుకు అవకాశముంటుందని ఆయన అంటున్నారు. 

రెస్పాన్స్ అంతంతే..
పిల్లల అటెండెన్స్ మెరుగుపరిచేందుకు, వారి చదువుపై పేరెంట్స్​లో అవగాహన కల్పించేందుకు ఈ మీటింగ్స్ ఉపయోగపడనున్నాయి. కానీ మీటింగ్‌‌లు నిర్వహించే సమయంలో చాలా మంది పేరెంట్స్ హాజరు కావడం లేదు. హాజరైన పేరెంట్స్ నుంచి కూడా పిల్లల అకడమిక్ ఇయర్ గురించి కాకుండా మధ్యాహ్న భోజనం, టీచర్లపై ఉన్న కంప్లయింట్స్ గురించి మాట్లాడుతున్నారని పలువురు హెడ్ మాస్టర్లు అంటున్నారు.  కొన్ని సర్కారు స్కూళ్లలో ఎగ్జామ్స్ అయ్యాక ప్రొగ్రెస్ కార్డ్స్ ఇచ్చే  టైమ్​లో ఈ రకమైన మీటింగ్‌‌లు పెట్టి స్టూడెంట్స్ స్టడీస్​పై పేరెంట్స్​తో రివ్యూ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా పేరెంట్స్ ను పిలిపించి వారిని ఇందులో భాగస్వామ్యం చేసేందుకు పలువురు హెడ్‌‌మాస్టర్లు చొరవ తీసుకుంటున్నారు. ఈ పేరెంట్, టీచర్ మీటింగ్‌‌ వల్ల అటెండెన్స్ పెరిగి, అకడమిక్స్ లో స్టూడెంట్లు మరింత రాణించేలా ఉపయోగపడాలని హెడ్‌‌ మాస్టర్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పేరెంట్స్ నుంచి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదని వారు చెప్తున్నారు.

గత నెల నుంచి మొదలుపెట్టాం
మా స్కూల్‌‌లో గత నెల నుంచి పేరెంట్, టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నం.  మొదటిసారి 200 మంది పేరెంట్స్ హాజరయ్యారు. దాదాపు 50శాతం మంది వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఇక్కడే చదువుతున్నవారు కూడా ఉన్నారు. పిల్లల క్రమశిక్షణ, అటెండెన్స్, స్కూల్​లో  ఆ రోజు చెప్పిన పాఠాలు, ఇతర విశేషాల గురించి పేరెంట్స్ వారి పిల్లలను అడిగి తెలుసుకోవాలని చెప్పాం. ముఖ్యంగా పిల్లలను రెగ్యులర్​గా స్కూల్ కు పంపాలని తెలిపాం. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ద్వారా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇందులో అన్ని క్లాసుల స్టూడెంట్ల పేరెంట్స్ పాల్గొనేలా చూస్తున్నాం.
- నిరంజన్, హెచ్ఎం, ప్రభుత్వ హై స్కూల్, మణికొండ.