
మార్కులే జీవితం కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని వారి తల్లిదండ్రులను కోరారు. పరీక్షలే సర్వస్వమని విద్యార్థులను భయపెట్టొద్దన్నారు. ప్రపంచం చాలా మారిందని… అనేక అవకాశాలున్నాయని చెప్పారు. ఢిల్లీలోని తాల్ కటోరా స్టేడియంలో జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల గురించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనవసర ఆందోళన వద్దని సూచించారు.
ఓటమి విజయానికి మెట్టు లాంటిదన్నారు మోడీ. చంద్రయాన్-2 వైఫల్యాన్ని గుర్తు చేశారు. ఇస్రోకు వెళ్లొద్దని చాలామంది తనతో చెప్పారన్నారు. అది సక్సెస్ అవుతుందనే గ్యారంటీ లేదని… అది ఫెయిల్ అయితే ఏంటని తనను అడిగారని మోడీ తెలిపారు. అది విఫలమైనప్పుడు తాను బాధపడ్డా… శాస్త్రవేత్తలను మోటివేట్ చేసేలా మాట్లాడానని గుర్తు చేశారు. 2001లో భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ను గుర్తు చేశారు. భారత్ ఫాలో ఆన్ లో పడ్డా… VVS లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ లు మ్యాచ్ ను మార్చేశారన్నారు.