- ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
- తీవ్రమైన ఎండల నుంచి ఊరట
పారిస్: వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తోపాటు ఐల్-దె-ఫ్రాన్స్ ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. పారిస్ రీజియన్‌తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వడగండ్ల వాన, వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ల బేస్‌మెంట్లు మునిగిపోయే ప్రమాదం ఉందని, అటవీ ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప సాయంత్రం తర్వాత ప్రయాణాలు చేయొద్దని, అడవులు, నదులు, సరస్సుల చుట్టుపక్కలకు వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. ఈ వారంలో ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిస్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరాయి. ఈ వర్షాలతో నగరవాసులకు ఎండల నుంచి కాస్త ఊరట లభించింది.
ఈఫిల్ టవర్‌పై పిడుగు
పారిస్‌లో 1033 అడుగుల ఎత్తున్న ఈఫిల్ టవర్‌పై పిడుగు పడింది. ఆ సమయంలో తీసిన వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. సాధారణంగా ఈ టవర్‌పై సగటున ఏడాదికి సుమారు ఐదుసార్లు పిడుగులు పడుతుంటాయి. దానిపై ప్రత్యేక లైట్‌నింగ్ రాడ్లు, గ్రౌండింగ్ సిస్టమ్ ఏర్పాటు ఉండడంతో పిడుగులు పడ్డా కట్టడానికి పెద్దగా నష్టం జరగదు. 1902లో మాత్రం ఒక భారీ పిడుగు దెబ్బతో టవర్ పైభాగానికి కొంత నష్టం జరగడంతో పైభాగాన్ని మళ్లీ నిర్మించారు.
