గదులు నిర్మించి వ్యాపారులకు అద్దెకు ఇచ్చిన కబ్జాదారులు

గదులు నిర్మించి వ్యాపారులకు అద్దెకు ఇచ్చిన కబ్జాదారులు

మూసాపేట, వెలుగు: కేపీహెచ్​బీ డివిజన్ పరిధి 6వ ఫేజ్ గోకుల్ ప్లాట్స్ చౌరస్తా నుంచి వసంతనగర్ వెళ్లే మెయిన్ రోడ్​లోని రూ. కోట్లు విలువ చేసే పార్కు స్థలం ఆక్రమణకు గురైంది. రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల కిందట మన కూరగాయలు పేరుతో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఈ పార్కులోని కొంత స్థలంలో ఓ స్టాల్​ను ఏర్పాటు చేయగా వ్యాపారం సరిగా జరగకపోవడంతో దాన్ని మూసివేశారు. తాజాగా ఈ స్టాల్​ను అద్దెకు ఇచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే పార్కులోని మిగతా స్థలంపై కాలనీ అసోసియేషన్ సభ్యుల కన్నుపడింది. ఖాళీగా ఉన్న మిగతా స్థలంలో 6వ ఫేజ్ అసోసియేషన్ సభ్యులు టెంట్లు వేసి గదులను ఏర్పాటు చేశారు. 

వాటిని వ్యాపారులకు అద్దెకిస్తూ ఒక్కో గదికి నెలకు రూ.15 వేల నుంచి 20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పార్కు స్థలం మొత్తం కబ్జాకు గురవుతున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు, బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై మూసాపేట సర్కిల్  డిప్యూటీ కమిషనర్ రవికుమార్​ను వీ6 వెలుగు వివరణ కోరగా.. పార్కు స్థలం కబ్జాకు గురవుతున్నట్లు మంగళవారమే తమ దృష్టికి వచ్చిందన్నారు. చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించానని తెలిపారు. కబ్జాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.