
- మొత్తం గుంతలమయం వాన పడితే బురద మయం
- పట్టించుకోని ఎల్అండ్ టీ
- టూ, ఫోర్ వీలర్ ప్రయాణికుల ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: నాగోల్ మెట్రో పార్కింగ్ నిర్వహణ అధ్వానంగా, అస్తవ్యస్తంగా ఉంది. చిన్న వానకే పార్కింగ్ ఏరియా మొత్తం బురదతో గుంతల మయంగా మారుతోంది. దీంతో టూ వీలర్, ఫోర్ వీలర్ పార్క్‌చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పార్కింగ్చార్జీలు వసూలు చేస్తున్న ఎల్అండ్టీ మెట్రో మెయింటనెన్స్‌ను పట్టించుకోకపోవడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు.
ఎల్అండ్టీ బాదుడే బాదుడు..
నాగోల్, మియాపూర్ మెట్రో పార్కింగ్ ప్లేసుల్లో కొన్ని నెలల క్రితం వరకు ఫ్రీగా వాహనాలను పెట్టుకోనిచ్చేవారు. తర్వాత మెట్రో నష్టాల్లో ఉందంటూ మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్ల పార్కింగ్ ప్రాంతాల్లో ఎల్అండ్టీ చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టింది. సగటున రోజూ 10 గంటలు టూవీలర్ పార్క్ చేస్తే, రూ. 25, ఫోర్ వీలర్ అయితే రూ. 75 తీసుకుంటున్నారు. నెలకు సగటున ఒక టూ వీలర్‌కు సుమారు రూ. 700, ఫోర్ వీలర్‌కు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు.
సాదాసీదా వానకే అస్తవ్యస్తం..
నాగోల్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీనికే, శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ పార్కింగ్ ఏరియాలో నీళ్లు నిలిచే ఉన్నాయి. అప్పటికే అక్కడ ఉన్న గుంతల్లో ఈ నీళ్లు చేరి పార్కింగ్చేయడానికి వచ్చిన వారిని చిరాకు పెట్టాయి. బండి పెట్టేందుకు వెళ్తుంటే జంప్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న వానకే ఇలాంటి పరిస్థితి ఇలా ఉంటే తుఫాన్లు, భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నందున మట్టి రోడ్ల స్థానంలో పక్కా రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
రోజూ రూ. 75 చెల్లిస్తున్నా...
నేను నా కార్ మెట్రో పార్కింగ్ లో పెట్టి ఆఫీసుకు వెళ్తా. ఇది వరకు నాగోల్ మెట్రోలో పార్కింగ్ ఫ్రీగా ఉండేంది. ఇప్పుడు రోజూ రూ.75 చెల్లిస్తున్నా. అయితే, ఎప్పుడైనా వర్షం పడితే మట్టితో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి వెళ్లడం సాధ్యం కావడం లేదు. చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు సౌకర్యాలు కూడా కల్పించాలి కదా. – తిరుమల్, సాప్ట్వేర్ ఇంజినీర్
డబ్బులు కట్టి ఏం లాభం...
నాగోల్ మెట్రో పార్కింగ్ఏరియాలో రోజూ టూ వీలర్ పార్క్ చేస్తా.. మొన్నటి వానలకు చాలా తిప్పలైంది. టూ వీలర్‌తో లోపలకు వెళ్లడానికే వీలు కాలే..మొత్తం గుంతలు, నీళ్లు.. పైన షెడ్లు కూడా లేక ఎండకు ఎండి, వానకు తడిసి ఖరాబైతంది. దీని మీద మెట్రో స్పందించాలి.
– మహేశ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్