పార్క్ ల పేరుతో లక్షల ప్రజాధనం వృథా

పార్క్ ల పేరుతో లక్షల ప్రజాధనం వృథా
  • విరిగిన పరికరాలు, పెరిగిన గడ్డి
  • సౌలత్​లు అంతంతమాత్రమే
  • పర్యవేక్షణను గాలికొదిలేశారు 
  • లక్షల రూపాయల పబ్లిక్ ​మనీ వృథా

 కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని పార్క్​లు మెయింటెనెన్స్ లేక అధ్వానంగా మారాయి. పొద్దంతా పని చేసి వచ్చిన ఎంప్లాయీస్​, చిన్నా పెద్దా కాసేపు పార్క్​లో సేదదీరుతామనుకుంటే అక్కడ సౌలత్​లు లేక అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవాలన్నా, యువత, పెద్దలు కాసేపు ఎక్సర్​సైజ్​చేయాలన్నా పరికరాలన్నీ విరిగిపోయి ఉన్నాయి.  కొత్త పార్క్​ల ఏర్పాటు పక్కన పెడితే ఉన్న వాటిని మెయింటెయిన్​ చేసే పరిస్థితి లేదు. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంలో 10 శాతం ఫండ్స్​ తప్పనిసరిగా గ్రీనరీ కోసం కేటాయించాలని మున్సిపల్​యాక్ట్​లో పొందుపర్చారు. ప్రతి వార్డులో మున్సిపాల్టీకి ఓపెన్​ స్థలాలు ఉంటాయి. ఇందులో పార్క్​లను ఏర్పాటు చేయాలి. కామారెడ్డి టౌన్​లో సిరిసిల్ల రోడ్డులో రాజీవ్​ పార్క్, విద్యానగర్​కాలనీలో రోటరీ పార్క్, స్నేహపురి కాలనీల్లోనే పార్క్​లు ఉన్నాయి. మిగతా కాలనీలో ఏర్పాటు చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రీనరీ కోసం మున్సిపల్ బడ్జెట్​లో రూ.3.52 కోట్ల ఫండ్స్​కేటాయించారు. లక్షలాది రూపాయల ఖర్చుతో  ఏర్పాటు చేసిన పార్క్​లను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారుతున్నాయి. దీంతో పట్టణవాసులకు గ్రీనరీ కరువైంది. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసిన పరికరాలు, నిర్మాణాలు ఏడాదిలోపే పనిచేయడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. 

రాజీవ్​పార్క్​లోనూ అదే పరిస్థితి.. 

సిరిసిల్ల రోడ్డులోని రాజీవ్​ పార్క్​ను 2006లో రూ. 33 లక్షలు ఖర్చుతో ఏర్పాటు చేశారు. ఇక్కడికి ప్రతి రోజు వందలాది మంది వస్తారు.  మెయింటెనెన్స్​సరిగా లేకపోవడంతో ఆట పరికరాలు, ఊయల విరిగిపోయాయి.  ఫౌంటెయిన్​ పని చేయటం లేదు.  కొన్ని చెట్లు,  గడ్డి బాగా పెరిగాయి.  శానిటైజేషన్​చేపట్టకపోవడంతో పార్క్​లో దుర్వాసన వస్తోంది.  కూర్చోడానికి బెంచీలు కూడా లేవు.

 

గడ్డి పెరగడంతో పాములు తిరుగుతున్నాయి

స్నేహపురి కాలనీలోని పార్కులో గడ్డి బాగా పెరిగింది. దీన్ని తొలగించకపోవడంతో పాములు తిరుగుతున్నాయి. వాకింగ్ కోసం రావాలంటేనే భయమేస్తోంది.  పిల్లలు కూడా ఆడుకునేందుకు వస్తుంటారు. పెరిగిన గడ్డిని తొలిగించి పార్క్​ను క్లీన్​చేస్తే బాగుంటుంది.
 శ్రీనివాస్, అశోక్ నగర్ కాలనీ

పార్క్​ల డెవలప్​మెంట్​కు చర్యలు తీసుకున్నాం 

టౌన్ లో ఉన్న పార్క్​ల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు పార్క్​లను క్లీన్​చేయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని డెవలప్​మెంట్​ పనులు చేశాం. పార్కుల్లో పెరిగిన గడ్డిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఆట వస్తువులు, జిమ్​పరికరాలను రిపేరు చేయిస్తాం.
దేవేందర్, మున్సిపల్ కమిషనర్