ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, క్రీడలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం (మార్చి 26) అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్ లో సన్నాహాక సమావేశం నిర్వహించారు.
నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఉల్లాసం, ఉత్సాహం నింపడమే కాకుండా, రాష్ట్ర ప్రజల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. మార్చి 28, 29 తేదీల్లో శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు ‘మొదటి ఎడిషన్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి పోటీలు తొలిసారిగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఎల్బీ స్టేడియంలో 28వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని, మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు సభ్యులందరూ పాల్గొంటారని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.
►ALSO READ | భద్రాచలంలో శ్రీరామనవమి సందడి.. రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం !
రాష్ట్రంలో అన్ని వయసుల వారికి క్రీడలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం శాసనసభ సచివాలయం, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, భాషా సాంస్కృతిక శాఖల సమన్వయంతో వివిధ క్రీడాంశాల్లో పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. రవీంద్రభారతీలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో శాసనమండలి విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, యశస్విని రెడ్డి, పాల్వాయి హరీష్ రావు, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ రావు, భాను ప్రసాద్ రావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ డా. సోనీ బాలాదేవి, శాసనమండలి కార్యదర్శి నరసింహచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్. తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
