బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడుతుండగా.. మరొకొన్ని చోట్ల ఎండు మండిపోతున్నాయి. అయితే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మార్చి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 'ఎల్లో అలర్ట్' జారీ చేస్తూ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వర్ష ప్రభావం కనిపించనుంది.
ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
