- ఇకపై ముడి పొగాకుపై 60–70 శాతం ట్యాక్స్
న్యూఢిల్లీ: దేశంలో ఇకనుంచి పొగాకు, దాని ఉత్పత్తులు అయిన సిగరెట్లు, పాన్మసాలాలపై ధరల మోత మోగనున్నది. పొగాకు, దాని ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్రం రూపొందించిన ‘సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025’కు పార్లమెంట్ గురువారం ఆమోదం తెలిపింది. రాజ్యసభలో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించిన తర్వాత తిరిగి లోక్‌సభకు పంపింది.
జీఎస్టీ పరిహార సెస్సు ముగిసిన తర్వాత నుంచి ఈ చట్టం అమలు కానున్నది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ముడి పొగాకుపై 60–-70% ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. సిగరెట్లు, చుట్టలపై 25% ట్యాక్స్ ఉంటుంది. లేదా ప్రతి వెయ్యి చుట్టలకు రూ.5వేల చొప్పున సెస్పడుతుంది. ప్రతి వెయ్యి ఫిల్టర్ సిగరెట్లకు రూ.2,700 నుంచి రూ.11,000 వరకు ట్యాక్స్ ఉంటుంది. ఇక నమిలే పొగాకు కిలోకు రూ.100 చొప్పున ట్యాక్స్ వసూలు చేస్తారు. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
ఈ అధిక ఎక్సైజ్సెస్ విధించడంతో పాన్ మసాలా వినియోగాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సెస్ నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగం ఆరోగ్య అవగాహన లేదా ఇతర ఆరోగ్య సంబంధిత పథకాలు, కార్యక్రమాల కోసం కేటాయిస్తామని చెప్పారు. ‘‘సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో 41 శాతాన్ని రాష్ట్రాలతో పంచుకుంటాం. ఇది సెస్సే తప్ప, అదనపు పన్ను కాదు. ఈ డబ్బును కేంద్రం తీసుకుపోదు. ఇది జీఎస్టీకి ముందూ ఉంది’’ అని తెలిపారు.
తప్పుడు ప్రకటనలను నిరోధించండి: ఎంపీలు
టొబాకో, లిక్కర్, ఇతర ఉత్పత్తులను ప్రోత్సహించేలా తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇవ్వడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని పలువురు రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు. దేశంలో క్యాన్సర్, ఇతర వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు.
రాజ్యసభలో ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025పై చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడారు. పిల్లలు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రజలు పొగాకు, సంబంధిత ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని, దీని కారణంగా క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు.
