
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటన తీవ్రమైన విషయమని, తక్కువ అంచనా వేయలేమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయొద్దని కోరారు. హిందీ దినపత్రిక ‘దైనిక్ జాగరణ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. దీని వెనుక ఉన్న వ్యక్తుల మూలాలను, వారి ఉద్దేశాలను తెలుసుకోవడం అవసరం” అని చెప్పారు. భద్రతా ఉల్లంఘన బాధాకరమని, ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం సమష్టి స్ఫూర్తితో కృషి చేయాలని, రాద్ధాంతం చేయడం మానుకోవాలని కోరారు. స్పీకర్ కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కొత్త వ్యక్తులను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడంపై స్పందిస్తూ.. సీఎంగా ఎంపికైన నేతలకు ఎంతో అనుభవం ఉందని, అక్కడ వారి కృషి ఎంతో ఉందని చెప్పారు.