ఇలాకాలో పట్టు నిలిచేనా!

ఇలాకాలో పట్టు నిలిచేనా!
  • బీఆర్ఎస్​కు ఇజ్జత్​కా సవాల్​గా మారిన మెదక్​ సెగ్మెంట్​
  • ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ఫోకస్
  • అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు

 

మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు  పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మెజార్టీ లోక్​సభ సీట్లు గెలిచి, పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్ సభ స్థానంలో గెలుపు ఆ పార్టీకి ఇజ్జత్ కా సవాల్ గా మారింది. ఈ మేరకు అభ్యర్థిని ఖరారు చేసిన ఆ పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది.  మెదక్​ లోక్​సభ సెగ్మెంట్​లో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్​ అభ్యర్థులు గెలిచారు. మెదక్ స్థానాన్ని కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. సెగ్మెంట్​పరిధిలో పార్టీకి 2.40 లక్షల ఓట్ల మెజార్టీ లభించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్ఎస్​ గెలుపు సులువేనని ఆ పార్టీ లీడర్లు భావించారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో  గెలుపు ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జన భర్జన పడడం ఇందుకు నిదర్శనం.

కాంగ్రెస్, బీజేపీ​నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉండడంతో  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ లేదా మాజీ సీఎం కేసీఆర్​ లో ఎవరోఒకరు పోటీ చేయొచ్చన్న వార్తలు వినిపించాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పార్టీ  ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈయన గతంలో సిద్దిపేట కలెక్టర్​గా పనిచేశారు.

మీటింగ్​లతో క్యాడర్​ సన్నద్ధం...

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్​లో స్తబ్ధత నెలకొంది. ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు గెలిచినా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం లేదు. కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లు బీఆర్ఎస్​ నుంచి  అధికార కాంగ్రెస్​పార్టీలోకి వెళ్లారు. పార్లమెంట్​ఎన్నికల షెడ్యూల్​ వెలువడి, అభ్యర్థి ఖరారు కావడంతో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంపై బీఆర్ఎస్​ ఫోకస్​ పెట్టింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు పెట్టి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సంగారెడ్డి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీటింగులు పూర్తి కాగా, మిగతా సెగ్మెంట్లలోనూ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

18.12 లక్షల ఓటర్లు..2,124 పోలింగ్​స్టేషన్లు

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్​ విడుదల కావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ ​లోక్​సభ సెగ్మెంట్ లో ఏడు  అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 18,12,858 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 8,95,777 మంది కాగా, 9,16,876 మంది మహిళలు, 205 మంది ట్రాన్స్​జెండర్లున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 46 మండలాల్లో 2,124  పోలింగ్​స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంల ఫస్ట్​ లెవల్​ చెకింగ్​ ఇప్పటికే పూర్తయింది.