
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, వెలుగు : వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జనాలకు నిరంతరం అందుబాటులో ఉన్నామని సికింద్రాబాద్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. కరోనా టైమ్‌లోనూ జనాలకు అందుబాటులో ఉండి సేవలందించామన్నారు. మీ ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సికింద్రాబాద్ సెగ్మెంట్ బౌద్ధనగర్ డివిజన్లో కార్పొరేటర్ కంది శైలజతో కలిసి ఆయన పర్యటించారు. జామై ఉస్మానియా, ఈశ్వరీబాయి నగర్, ఎల్. నారాయణ నగర్, అంబర్ నగర్, బౌద్ధనగర్, సంజయ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పర్యటనకు జనాల నుంచి అనూహ్య స్పందన దక్కింది.
కార్యకర్తలతో పాటు స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన శాశ్వత చర్యల వల్ల వరద ముంపు తప్పిందన్నారు. సికింద్రాబాద్ పరిధిలో ప్రధాన నాలాల వెడల్పు, కల్వర్టుల పునర్నర్మాణం లాంటి పనులు చేపట్టామన్నారు. ఈ నెల 18న సికింద్రాబాద్ సెగ్మెంట్లో జరగనున్న కేటీఆర్ రోడ్ షోను సక్సెస్ చేయాలని ఆయన కోరారు. అడ్డగుట్టలో పర్యటించిన రోడ్ షో ఏర్పాట్లను పరిశీలించారు. రోడ్ షోలో పాల్గొనేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పద్మారావు గౌడ్ సూచించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.