నల్గొండలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

నల్గొండలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

నల్గొండ అర్బన్, వెలుగు : ఈజీగా డబ్బు సంపాదించాలని గంజాయి అమ్ముతున్న ముగ్గురు నల్గొండ వన్ టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. సీఐ  రాజశేఖర్ రెడ్డి మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నల్గొండకు చెందిన తల్లమల్ల శివశంకర్, సికింద్రాబాద్ చెందిన భక్తుల శబరి గిరిశ్​రాజస్థాన్ లోని గ్లోబల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదివేటప్పుడు గంజాయికి అలవాటుపడ్డారు. నార్కట్ పల్లి చెందిన ఇంటర్ ఫ్రెండ్ యాసా భానుప్రకాశ్​రెడ్డి వద్ద శివశంకర్ గంజాయి తెచ్చుకుని తాగేవాడు. 

హైదరాబాద్ ఫతేనగర్ నుంచి  శబరి గిరీశ్​గంజాయి తెచ్చుకుంటుండగా, 2024 లో అరెస్టై జైలుకు వెళ్లొచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ముగ్గురు గంజాయి అమ్మేందుకు ప్లాన్ చేశారు. వారం కింద ముగ్గురూ కలిసి   ఓ మహిళ వద్ద 1.5 కేజీల గంజాయిని కొని నల్గొండకు తెచ్చారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ప్యాకెట్ రూ. 800 చొప్పున అమ్ముతున్నారు. 

మిగిలిన గంజాయిని సోమవారం పంచుకొని అమ్మడానికి యత్నిస్తుండగా.. సమాచారం మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద 1.21 కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. వీటి విలువ రూ. 30 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.  కేసును ఛేదించిన నల్గొండ వన్ టౌన్ ఎస్ఐలు సైదులు, గోపాల్ రావు, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.