
న్యూఢిల్లీ: తన కస్టమర్లకు మరింత వేగంగా పార్సిళ్లను డెలివరీ చేయడానికి ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. ఇందుకోసం స్టూడెంట్లకు, గృహిణులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పార్ట్‌టైం జాబ్స్ ఇవ్వనుంది. పార్ట్‌టైం వర్కర్లను నియమించుకోవడానికి అమెజాన్ ఫ్లెక్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఫ్లెక్స్ ద్వారా రద్దీ సమయాల్లో మరింత వేగంగా డెలివరీలు చేయడంతోపాటు ఉబర్ మాదిరి పార్ట్‌టైం జాబ్స్‌నూ ఇచ్చినట్టు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ–కామర్స్ వ్యాపారంలో స్పీడ్ డెలివరీ అత్యంత ముఖ్యం కాబట్టే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. వేగంగా పార్సిళ్లను అందించడానికి ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా వన్–డే డెలివరీ, టూ–డే డెలివరీ, నెక్ట్స్ డెలివరీ వంటి విధానాలను అమలు చేస్తోంది. ప్రైమ్‌నౌ ఆప్ ద్వారా కిరాణ సామగ్రి ఆర్డర్ చేస్తే రెండు గంటల్లోనే డెలివరీ ఇస్తోంది. ముఖ్యంగా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వారికి చాలా వస్తువులను ఆర్డర్ చేసిన మరునాడు అందజేస్తోంది. అమెజాన్ ఫ్లెక్స్‌లో చేరిన వారు రోజుకు నాలుగు గంటలపాటు పార్సిళ్లను అందజేయాలి. గంటకు రూ.120–140 వరకు సంపాదించవచ్చు. ప్రతి బుధవారం జీతం ఇస్తారు. ‘‘దేశవ్యాప్తంగా మా డెలివరీ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటున్నాం. అమెజాన్ ఫ్లెక్స్ వల్ల మరింత కస్టమర్లకు సేవలు అందించగలుగుతాం. మరింత వేగంగా వస్తువులను డెలివరీ ఇస్తాం’’ అని అమెజాన్ ఆసియా కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా అన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అమెజాన్ ఫ్లెక్స్ సేవలను ప్రారంభించేముందు ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. త్వరలోనే మరిన్ని నగరాల్లో అమెజాన్ ఫ్లెక్స్‌ను తీసుకొస్తామని సక్సేనా చెప్పారు.
ఇండియా.. ఏడో దేశం
అమెజాన్ ఫ్లెక్స్ ఇది వరకే ఉత్తర అమెరికా, జర్మనీ, స్పెయిన్, జపాన్, సింగపూర్, ఇంగ్లండ్‌లో ఉంది. ఈ కార్యక్రమం అమలవుతున్న ఏడో దేశం ఇండియా. ఫ్లెక్స్ వల్ల ఈ దేశాల్లో అమెజాన్ డెలివరీల సామర్థ్యం, వేగం పెరిగింది. అమెజాన్ ఇండియాలో 2013 నుంచి డెలివరీలు ఇస్తోంది. దాదాపు 99.9 శాతం పిన్‌కోడ్‌లకు సేవలు అందిస్తోంది. నాలుగు లక్షల మంది సెల్లర్లు అందించే 17 కోట్ల ప్రొడక్టులను డెలివరీ చేస్తోంది. గత ఏడాది ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఒకటిన్నర రెట్లు పెంచడంతో నిల్వ సామర్థ్యం 2017తో పోలిస్తే రెండు కోట్ల క్యూబిక్ ఫీట్లు పెరిగింది. అమెజాన్ ఫ్లెక్స్‌పై రిటైల్ కన్సల్టెన్సీ థర్డ్ ఐసైట్ సీఈఓ దేవాంగ్షు దత్తా స్పందిస్తూ స్పీడ్ డెలివరీలు ఇవ్వడం వల్ల కస్టమర్లకు కంపెనీపై మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు. దుకాణంలో వస్తువు కొంటే తక్షణం సంతృప్తి కలుగుతుందని, పార్సిల్ ఎంత త్వరగా వస్తే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. ఆలస్యం పెరిగినకొద్దీ కస్టమర్లు ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తారని వివరించారు. అమెజాన్ ఫ్లెక్స్ వల్ల డిమాండ్‌ను తట్టుకోవడం సులువు అవుతుందని, మరింత సమర్థంగా సేవలు అందించవచ్చని అన్నారు. ‘‘పండగల వంటి రద్దీ సమయాల్లో గిరాకీ ఎక్కువ ఉంటుంది. అందుకే షాపులు పార్ట్‌టైం వర్కర్లను పెట్టుకుంటాయి. అమెజాన్ కూడా ఇదే పనిచేస్తోంది. అయితే ఇవి తాత్కాలిక నియామకాలు కావు. ఎప్పుడూ పనిచేసుకోవచ్చు. వారంలో కొన్ని రోజుల్లో పార్సిళ్లు ఎక్కువ ఉంటాయి. అటువంటప్పుడు పార్ట్‌టైం వర్కర్లు సాయపడతారు’’ అని సక్సేనా వివరించారు.