చెరుకు రైతులకు అండగా ఉంటాం.. ట్రైడెంట్ యాజమాన్యం బకాయిలు చెల్లించాలి

చెరుకు రైతులకు అండగా ఉంటాం.. ట్రైడెంట్ యాజమాన్యం బకాయిలు చెల్లించాలి
  • రైతు సంఘాలు, అఖిలపక్ష లీడర్ల డిమాండ్
  • జహీరాబాద్​లో రైతుల  భారీ నిరసన ర్యాలీ, ధర్నా

జహీరాబాద్, వెలుగు: చెరుకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ట్రైడెంట్ యాజమాన్యం వెంటనే చెల్లించి, వచ్చే సీజన్​లో రైతుల వద్ద ఉన్న చెరుకును గాను గాడించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రైతు సంఘం నాయకులు నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో వారు పాల్గొన్నారు.

నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు ట్రైడెంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలోని చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అండగా అఖిలపక్ష నాయకులంతా ఉంటారని, ఎవ్వరూ అధైర్య పడొద్దన్నారు. రైతులకు బకాయిలు ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనివల్ల రైతులు నష్టపోయారన్నారు. ఏడాది గడుస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.

సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్, జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు ఎం జైపాల్ రెడ్డి, రామ్ చందర్ రాజనర్సింహ, శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ రెడ్డి, టీజేఎస్ నియోజకవర్గ కన్వీనర్ ఆశప్ప, రైతు సంఘం నాయకులు కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.