ప్రత్యర్థుల లిస్ట్ కోసం ఎదురుచూపు !..అన్ని పార్టీల్లోనూ అదే ధోరణి

ప్రత్యర్థుల లిస్ట్ కోసం ఎదురుచూపు !..అన్ని పార్టీల్లోనూ అదే ధోరణి
  • ఆశావహుల బుజ్జగింపులో ప్రధాన పార్టీలు
  •  నామినేషన్‌‌‌‌ వేసిన వారిలో టెన్షన్​ 

నిజామాబాద్, వెలుగు : మున్సిపల్‌‌‌‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసినా ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా ఖరారు కాలేదు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల లిస్ట్‌‌‌‌ వెలువడిన తర్వాతే ప్రకటించాలన్న ధోరణి అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. దీంతో నామినేషన్లు వేసిన ఆశావహుల్లో టెన్షన్‌‌‌‌ నెలకొంది. కాంగ్రెస్‌‌‌‌ టికెట్‌‌‌‌ వస్తుందనే ధీమాతో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఎవరి పేర్లు ప్రకటిస్తారోనని ఉత్కంఠకు గురవుతున్నారు.

 ఫిరాయింపులను నియంత్రించేందుకు ఆశావహులను ప్రధాన పార్టీలు బుజ్జగిస్తున్నాయి. సెలెక్టివ్‌‌‌‌ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మజ్లిస్‌‌‌‌ టికెట్లపై పైరవీలు హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌కు చేరాయి. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు నామినేషన్‌‌‌‌ వేసిన అభ్యర్థుల బలాబలాలను సమీక్షిస్తున్నారు.  

నగరపాలక పరిధిలో.. 

60 డివిజన్లు ఉన్న నిజామాబాద్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌లో 319 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి డివిజన్‌‌‌‌లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. టీపీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్​గౌడ్‌‌‌‌, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌‌‌‌రెడ్డి, షబ్బీర్‌‌‌‌ అలీ కలిసి సర్వే ఆధారంగా లిస్ట్​ను సిద్ధం చేశారు. ఈ జాబితాను ఎన్నికల ఇన్‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. 

అప్పటివరకు ప్రత్యర్థి బీజేపీ లిస్ట్‌‌‌‌ వెలువడుతుందేమోనని ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఆశావహులకు సర్ది చెప్పేందుకు జిల్లా పార్టీ కమిటీ రంగంలోకి దిగింది. టికెట్‌‌‌‌ దక్కిన అభ్యర్థిని గెలిపించేందుకు కలిసి పనిచేయాలని, విత్‌‌‌‌డ్రా అయ్యేవారికి భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. మేయర్‌‌‌‌ రేస్‌‌‌‌పై ఆశతో నామినేషన్లు వేసిన డివిజన్లు, చైర్మన్‌‌‌‌ పదవులపై ఆశలు పెట్టుకున్న బోధన్‌‌‌‌, ఆర్మూర్‌‌‌‌, భీంగల్‌‌‌‌ మున్సిపాలిటీల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇవన్నీ సర్దుబాటు కావడానికి మరో రోజు పట్టే అవకాశం ఉంది.  

బీజేపీలో కొందరు అభ్యర్థుల ప్రకటన.. 

నిజామాబాద్‌‌‌‌ నగర పాలక సంస్థ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో బీజేపీ నామినేషన్లు వేయలేదు. మిగతా 51 డివిజన్ల నుంచి 253 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ అర్వింద్‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేతో టికెట్లు ఎవరికివ్వాలనే విషయంపై దాదాపు స్పష్టత వచ్చింది. శనివారం కొంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, ఇంకా మరికొందరి పేర్లు ప్రకటించాల్సి ఉంది. 

కాంగ్రెస్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ వెలువడే వరకు వేచిచూడాలనే అభిప్రాయం కొందరు నేతల్లో కనిపిస్తోంది. కొన్ని డివిజన్లలో కొత్తవారికి, యువతకు అవకాశం ఇవ్వాలనే నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నారు. బోధన్‌‌‌‌లోని 38 వార్డుల్లో 22 వార్డుల నుంచి, ఆర్మూర్‌‌‌‌లోని 36 వార్డుల్లో 33 సెలెక్టివ్‌‌‌‌ స్థానాల నుంచి నామినేషన్లు వేయించారు. అభ్యర్థుల ఖరారు కాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్‌‌‌‌ కొనసాగుతోంది.  

సలార్‌‌‌‌ చెంతకు మజ్లిస్‌‌‌‌ టికెట్‌‌‌‌ రాజకీయాలు.. 

నిజామాబాద్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌లోని 24 డివిజన్లను మజ్లిస్‌‌‌‌ పోటీకి ఎంపిక చేయగా 79 నామినేషన్లు పడ్డాయి. బోధన్‌‌‌‌లో 27 వార్డులను సెలెక్ట్‌‌‌‌ చేసి 47 నామినేషన్లు వేయించారు. ఆర్మూర్‌‌‌‌లో గెలిచే అవకాశమున్న నాలుగు వార్డులనే ఎంపిక చేసి నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులను ఫైనల్‌‌‌‌ చేయడానికి జిల్లా కమిటీ హైదరాబాద్‌‌‌‌లోని హైకమాండ్‌‌‌‌ నేత సలాఉద్దీన్‌‌‌‌ ఓవైసీ వద్దకు వెళ్లింది.

 బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తరఫున నగరంలోని 3, 54 డివిజన్ల నుంచి అభ్యర్థులు లభించలేదు. మిగతా డివిజన్లు, ఇతర మున్సిపాలిటీల్లోని స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. బీ-ఫారం జారీపై నామినేషన్‌‌‌‌ వేసిన అభ్యర్థులతో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు.