
సూర్యాపేట, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావడం ఖాయమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కండువా కప్పుకొని, పార్టీ మారలేదంటూ ఆ ఎమ్మెల్యేలు బుకాయిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు సీఎం తమ ఇంటికి వచ్చారని అబద్దాలు చెబుతున్నారన్నారు.
సమస్యలపై చర్చే అయితే బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయించారని, పార్టీ మారకపోతే బీఆర్ఎస్ ఆఫీస్‌కు ఎందుకు రావడం లేదని, బీఆర్ఎస్ లోనే ఉంటే కేసీఆర్‌ను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. స్పీకర్ నోటీసులకు తాము సమాధానం ఇస్తామని, వారు డిస్ క్వాలిఫై అవుతారని చెప్పారు.