మైనంపల్లి ఇన్​.. కంఠారెడ్డి ఔట్

మైనంపల్లి ఇన్​.. కంఠారెడ్డి ఔట్
  • రసవత్తరంగా మెదక్​ రాజకీయం
  • టికెట్లు రావని లీడర్ల పార్టీ ఫిరాయింపులు

మెదక్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెదక్ నియోజక వర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్​లభించే అవకాశాలు లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీల లీడర్లు పార్టీ ఫిరాయిస్తున్నారు.  మల్కాజిగిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్ మెదక్​ స్థానంలో  బీఆర్‌‌‌‌ఎస్​టికెట్​ ఆశించారు. గత ఆరు నెలలుగా తన స్వచ్ఛంద  సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. తనకు బీఆర్ఎస్​ టికెట్​వస్తుందని ఆశించగా అధిష్టానం మాత్రం సిట్టింగ్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన రోహిత్​ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్​లో జాయిన్​ అయ్యారు. ఇంకా అధికారికంగా టికెట్​ కేటాయించనప్పటికీ మెదక్​ అసెంబ్లీ టికెట్ ఆయనకే కన్ఫర్మ్​ అయినట్లు సమాచారం. 

చేయి విడిచిన కంఠారెడ్డి 

ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న డీసీసీ ప్రెసిడెంట్​​ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి  కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఆ పార్టీ తరపున మొత్తం 12 మంది దరఖాస్తు చేసినప్పటికీ కచ్చితంగా తనకే అవకాశం లభిస్తుందని ఆయన భావించారు. అయితే మైనంపల్లి రోహిత్​ పార్టీలో జాయిన్​ కావడంతో ఆయన టికెట్​ఆశలు సన్నగిల్లాయి. ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తనకు టికెట్​ రాదని భావించిన ఆయన డీసీసీ ప్రెసిడెంట్​ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

అనుచరుల నిర్ణయమేంటో...

డీసీసీ ప్రెసిడెంట్​తిరుపతిరెడ్డి కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేయగా ఇప్పటి వరకు ఆయన వెన్నంటి ఉన్న వివిధ మండలాల కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నిర్ణయం ఏమిటనే దానిపై అందరి దృష్టి నెలకొంది. తిరుపతిరెడ్డి బీఆర్ఎస్‌‌లో​ చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కాగా ఆయన అనుచరుల్లో ఒకరిద్దరు తప్ప మిగితా వారు కాంగ్రెస్​ పార్టీని వీడేందుకు ఇష్టంగా లేనట్టు తెలిసింది. డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ..  ఐదేళ్లుగా గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన తిరుపతిరెడ్డి కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేయడం బాధాకరమన్నారు. తాను మాత్రం పార్టీ మార్పు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పాపన్నపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల ముఖ్య నాయకులు మాత్రం కాంగ్రెస్​ లోనే కొనసాగాలని తీర్మానించుకున్నట్టు మండల కాంగ్రెస్​ కిసాన్​ సెల్​ అధ్యక్షుడు శ్రీకాంత్​ రెడ్డి తెలిపారు.  

సేవలు, కష్టాలకు గుర్తింపులేదు..

కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు,  పార్టీ బలోపేతం కోసం చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకుండా కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతోందని తిరుపతి రెడ్డి ఆరోపించారు. ఇలాంటి  పరిణామాలు చూసి మనోవేదనకు గురయ్యానన్నారు.  పార్టీని బలోపేతం చేసేందుకు తన శాయశక్తులా కృషిచేశానని, ఈ క్రమంలో అనేక అక్రమ పోలీస్ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. కానీ పార్టీ ఇదేది గుర్తించకుండా  జీవితాంతం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులకు నాయకత్వం అప్పగిస్తోందని విమర్శించారు. అలాంటి వారి నాయకత్వంలో పార్టీకి మనుగడ లేదని, ప్రజలకు కూడా ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై ఏఐసీసీ అధ్యక్షుడి తోపాటు, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ  మౌనం పాటించడం తనకెంతో ఎంతో బాధ కలిగించిందన్నారు. బరువెక్కిన గుండెతో కాంగ్రెస్ పార్టీని వీడటం తప్ప తనకు మరో మార్గం కనిపించడం లేదని స్పష్టం చేశారు.