నల్గొండ పార్లమెంట్​ స్థానంపై బీజేపీ గురి..కేంద్ర మంత్రి డాక్టర్​ మహేంద్రనాథ్​ పాండే

నల్గొండ పార్లమెంట్​ స్థానంపై బీజేపీ గురి..కేంద్ర మంత్రి డాక్టర్​ మహేంద్రనాథ్​ పాండే

 

  •     ఇన్​చార్జిగా కేంద్ర మంత్రి డాక్టర్​ మహేంద్రనాథ్​ పాండే
  •     నేటి నుంచి 2 రోజుల పాటు పర్యటన
  •     దేవరకొండ, మిర్యాలగూడలో ప్రత్యేక సమావేశాలు
  •     ఆరునెలల పాటు కొనసాగనున్న ప్రవాస్​ యోజన ప్రోగ్రామ్స్

నల్గొండ, వెలుగు: నల్గొండ పార్లమెంట్​ స్థానంపైన బీజేపీ గురిపెట్టింది. ఇంతవరకు దేశంలో ఆ పార్టీ గెలవని స్థానాల్లో కమలం జెండా ఎగురవేయాలని పార్టీ హైకమాండ్​ తీర్మానించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రవాస్​ యోజన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ప్రతి మూడు పార్లమెంట్​ స్థానాలకు ఒక కేంద్రమంత్రికి బాధ్యతలు అప్పగించింది. ఆరునెలల పాటు సాగనున్న ఈ కార్యక్రమానికి పార్లమెంట్​ప్రవాస్​యోజన అని పేరు పెట్టింది. ఇందులో భాగంగా వివిధ వర్గాల ప్రజలను, సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. గతంలో సూర్యాపేటలో కొత్త ఓటర్లతో ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ విడ తలో దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పర్యటిచేందుకు నల్గొండ పార్లమెంట్​ఇన్​చార్జి బండారు ప్రసాద్​ నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆది, సోమవారాల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్​ మహేంద్రనాథ్​ పాండే దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నల్గొండ, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​ జిల్లాలకు పాండే ఇన్​చార్జిగా వ్యవహరించనున్నారు. 

పెండింగ్​ప్రాజెక్టులు, గిరిజనుల సమస్యలే కీలకం..

గిరిజన జనాభా అధికంగా ఉన్న దేవరకొండలో తాగు, సాగునీటి సమస్య తో పాటు, ఫ్లోరైడ్​ సమస్య కూడా పట్టిపీడిస్తోంది. ప్రధానంగా నీటి సమస్య తీర్చేందుకు ఉమ్మడి ఏపీలో, బీఆర్​ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన డిండి లిఫ్ట్​ ఇరిగేషన్, ఎస్​ఎల్​బీసీ సొరంగ మార్గం, నక్కలగండి, పెండ్లిపాకల ప్రాజెక్టుల్లో ఎలాంటి పురోగతి లేదు. డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ కోసం గిరిజనుల  నుంచి వేల ఎకరాల భూములు సేకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి సమస్య మాత్రం తీర్చలేకపోయింది. పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తొమ్మిది రిజర్వాయర్ల పనులు పూర్తికాలేదు. ఇదిచాల దన్నట్టుగా కొత్తగా అంబాభవాని లిఫ్ట్​ ఇరిగే షన్​ స్కీం ను తెరపైకి తెచ్చింది. వీటితోపాటు స్థానిక గిరిజనులతో కేంద్ర మంత్రి మాట్లాడనున్నారు. దేవరకొండలో గిరిజనుల ప్రధాన సమస్యలు, పెండింగ్​ ప్రాజెక్టుల పైన స్థానిక లీడర్ల, ఓటర్లతో మీటింగ్​ నిర్వహించనున్నారు.

ఓటర్లు, పారిశ్రామిక వేత్తలతో భేటీ..

సోమవారం మిర్యాలగూడలో నియోజకవర్గ ఓటర్లు, పారిశ్రామిక వేత్తలో ప్రవాస్​ యోజన నాయకులు సమావేశమవుతారు. రైస్ ఇండ్రస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యలపై మిల్లర్లతో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం లేవీ ఎత్తివేయడం ద్వా రా ఎదురవుతున్న సమస్యలు, వడ్ల కొనుగోళ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి గురించి మిల్లర్లలో చర్చలు జరుపుతారు. ఇదే క్రమంలో మిర్యాలగూడలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి స్థానిక ఓటర్లతో సమావేశం కానున్నారు. 

ఏడు అసెంబ్లీ స్థానాల్లో కార్యక్రమాలు..

నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్​నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ప్రవాస్​ యోజన కార్యక్రమాలు విడతల వారీగా నిర్వహించనున్నారు. 34 కేటగిరీల్లో వివిధ వర్గాల ప్రజలను, మేధావులను, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సంబంధించిన వ్యక్తులు, నిరుద్యోగులు, యువకులు, ఓటర్లు, కుల సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రాధాన్యత కలిగిన అంశాలు, సమస్యలను ప్రధానంగా చర్చించి, ఎన్నికల సమయానికి పార్టీ  మ్యానిఫె స్టోలో పొందుపర్చనున్నారు. 

పర్యటన సక్సెస్​ చేయాలి

కేంద్ర మంత్రి పర్యటనను నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్​ చేయాలి.  ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి పాండేకు డిండి వద్ద స్వాగతం పలుకుతారు. 5 గంటలకు నక్కల గండి ప్రాజెక్టు విజిట్. 5.30గంట లకు గుర్రంతండాలో గిరిజనుల తో సమ్మేళనం. అక్కడే గిరిజనులతో కలిసి భోజనం చేస్తారు. మిర్యాలగూడలో బస చేస్తారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు రైస్​ మిల్లరతో మిల్లర్ల అసోసియే షన్​ భవన్​లో సమావేశం. 11.30గంటలకు విఘ్నేశ్వర ఎస్టేట్​లో మి ర్యాలగూడ అసెంబ్లీ కీ ఓటర్లతో సమావేశం ఉంటుంది. 

-  బండారు ప్రసాద్, నల్గొండ పార్లమెంట్​ప్రవాస్​ యోజన కన్వీనర్​