మెదక్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఎవరు..?

మెదక్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఎవరు..?
  • సమాలోచనలు చేస్తున్న పార్టీ హైకమాండ్​
  •     బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని ప్లాన్
  •     బీఆర్ఎస్ క్యాండిడేట్​గా వెంకట్రామిరెడ్డి
  •      బీజేపీ క్యాండిడేట్ గా రఘునందన్ రావు

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : మెదక్ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై ఆ పార్టీ హైకమాండ్​సమాలోచనలు చేస్తుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ మాత్రం ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, బీఆర్ఎస్ క్యాండిడేట్ గా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని శుక్రవారం ఆ పార్టీ హై కమాండ్ ఖరారు చేసింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. 

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కు ముందు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పేర్లు వినిపించినప్పటికీ తర్వాత పటాన్ చెరుకు చెందిన ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు, నరెన్ ట్రస్ట్ అధినేత చాగన్ల నరేంద్రనాథ్, సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త జయరాంరెడ్డి పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

తెరపైకి చాగన్ల నరేంద్ర నాథ్

మెదక్ కాంగ్రెస్ టికెట్ రేస్ లో తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. కొత్తగా చాగన్ల నరేంద్రనాథ్ పేరు వినిపిస్తోంది. మెదక్ స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. నరేంద్రనాథ్ ఉమ్మడి మెదక్ జిల్లా వాసులకు సుపరిచితుడిగా ఉండి నరెన్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వందల మంది పేదలకు ఉచిత వివాహాలు జరిపించి అవసరమైన సామగ్రి ఫ్రీగా ఇప్పించారు. 

2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేయగా ఓటమి తప్పలేదు. తర్వాత నరేంద్రనాథ్ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నరేంద్రనాథ్ మళ్లీ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
 
సీన్ లోకి జయరాంరెడ్డి

సిద్దిపేట నియోజకవర్గంలోని మందపల్లి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త జయరాంరెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. అతన్ని పార్టీలో చేర్చుకుని మెదక్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై జయరాంరెడ్డితో కొందరు కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు పట్టున్న సిద్దిపేట ప్రాంతం నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి టికెటిస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కు ధీటైన పోటీ ఇవ్వడంతో పాటు ఆర్థిక, అంగబలం ఉన్న జయరాంరెడ్డిని బరిలోకి దించాలనే దిశగా కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో జయరాంరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

జగ్గారెడ్డి వర్సెస్ నీలం మధు

సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు మధ్య పోటీ నెలకొంది. టికెట్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని జగ్గారెడ్డి పట్టు పడుతుండగా మధుకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ కీలక నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్టు వద్దు అంటూనే ఢిల్లీలో మకాం వేసిన జగ్గారెడ్డి వరుసగా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డి సతీమణి, సంగారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలరెడ్డికి ఇటీవల టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో జగ్గారెడ్డికి ఎంపీ టికెట్ దక్కదన్న పబ్లిసిటీ పెరిగింది. 

పటాన్ చెరుకు చెందిన నీలం మధుకు మెదక్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని ముదిరాజ్ సంఘం నాయకులు పట్టుబడుతున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో ముదిరాజ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున మధు గెలుపు ఖాయమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ నీలం మధుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి ఆఖరి క్షణంలో మార్చి ముదిరాజులకు అన్యాయం చేశారన్న వాదన వినిపిస్తోంది. కనీసం ఎంపీ టికెట్ ఇస్తే మధును గెలిపించుకుంటామని సంఘం పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర నాయకత్వం ఇటీవల పార్టీ హై కమాండ్ కు పంపిన ఫైనల్ లిస్ట్ లో మధు పేరు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.