కేసులు ఎత్తేసి.. పోడు భూములకు పట్టాలివ్వాలి

కేసులు ఎత్తేసి.. పోడు భూములకు పట్టాలివ్వాలి
  • సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

మంచిర్యాల జిల్లా: ఆదివాసీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులు, పోలీసుల పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాలిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ గుర్తులేనట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు.  దండేపల్లి మండలం కోయపోషగూడ లో 300 మందికిపైగా అటవీశాఖ సిబ్బంది, పోలీసులు మొహరించి ఆదివాసీలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

కోయపోషగూడెంలో పర్యటించిన నారాయణ అటవీశాఖ అధికారుల దౌర్జన్యానికి గురైన పోడు రైతులకు దైర్యం చెప్పారు. ఆదివాసి మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించి, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. గిరిజన మహిళలపై దాష్టీకం ప్రదర్శించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అవలంబిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలను మానుకుని ఆదివాసులను ఆదుకోవాలని నారాయణ కోరారు.