
- మారుతీ సేల్స్ 3.39 శాతం పెరుగుదల
- టాటా సేల్స్‌లో మాత్రం తగ్గుదల
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ హోల్‌సేల్స్ గత నెల బాగున్నాయి. ఫెస్టివల్సీజన్ కావడంతో డీలర్లు భారీగా స్టాక్‌ను కొన్నారు. టాటా మోటార్స్ మినహా అన్ని కంపెనీలూ గ్రోత్‌ను సాధించాయి. ఇది అమ్మకాలలో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. మనదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ అమ్మకాలు వార్షికంగా 3.39 శాతం పెరిగాయి. మిగతా కంపెనీల అమ్మకాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మారుతీ సుజుకీ
మారుతీ సుజుకి ఇండియా మొత్తం అమ్మకాలు 3.39 శాతం పెరిగి 2023 నవంబర్‌లో 1,64,439 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 1,59,044 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, థర్డ్-పార్టీ సరఫరాలతో కూడిన మొత్తం దేశీయ విక్రయాలు గత నెలలో 1,39,306 యూనిట్ల నుంచి 1.57 శాతం పెరిగి 1,41,489 యూనిట్లుగా నమోదయ్యాయని మారుతీ సుజుకీ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) విక్రయాలు 2022 నవంబర్లో 1,32,395 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 1,34,158 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 1.33 శాతం వృద్ధిని సాధించింది. 2022 నవంబర్‌లో 19,738 యూనిట్ల ఎగుమతులు ఉండగా, గత నెలలో ఎగుమతులు 22,950 యూనిట్లకు పెరిగాయని మారుతీ సుజుకీ తెలిపింది.
టాటా మోటార్స్
టాటా మోటార్స్ అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో 1.73 శాతం తగ్గుదలతో 74,172 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 75,478 యూనిట్లు విక్రయించింది. సంస్థ మొత్తం దేశీయ విక్రయాలు 2022 నవంబర్లో 73,467 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 72,647 యూనిట్లుగా ఉన్నాయి. వార్షికంగా ఇవి ఒక శాతం తగ్గాయని టాటా మోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) సహా మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) అమ్మకాలు 46,425 యూనిట్ల నుంచి 46,143 యూనిట్లుకు పడిపోయాయి. ఇవి కూడా ఒక శాతం తగ్గాయి. దేశీయ మార్కెట్లో వీటి అమ్మకాలు 46,037 యూనిట్ల నుంచి 46,068 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి.
హ్యుందాయ్
తమ మొత్తం విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 3 శాతం పెరిగి 65,801 యూనిట్లకు చేరుకున్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఈ సంస్థ 2022 నవంబర్లో డీలర్లకు 64,003 యూనిట్లను విక్రయించింది. కంపెనీ దేశీయ టోకు విక్రయాలు 48,002 యూనిట్ల నుంచి 3 శాతం వృద్ధితో 49,451 యూనిట్లకు పెరిగాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎగుమతులు 2022 నవంబర్లో 16,001 యూనిట్ల నుంచి గత నెలలో 16,350 యూనిట్లకు పెరిగాయి.
టీవీఎస్ మోటార్
తమ సంస్థ మొత్తం డిస్పాచ్‌లు 2023 నవంబర్లో 31 శాతం పెరిగి 3,64,231 యూనిట్లకు చేరుకున్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ శుక్రవారం పేర్కొంది. 2022 నవంబర్లో కంపెనీ మొత్తం 2,77,123 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. టూవీలర్స్ వెహికల్స్ విక్రయాలు 2023 నవంబర్లో 3,52,103 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో 2,63,642 యూనిట్లు అమ్మింది. అంటే ఇవి 34 శాతం పెరిగాయి. దేశీయ టూవీలర్స్ వెహికల్ విక్రయాలు 2022 నవంబర్లో 1,91,730 యూనిట్ల నుంచి 2023 నవంబర్‌లో 50 శాతం పెరిగి 2,87,017 యూనిట్లకు చేరాయి.
మహీంద్రా & మహీంద్రా
మహీంద్రా & మహీంద్రా మొత్తం హోల్‌సేల్స్ ఏడాది ప్రాతిపదికన 21 శాతం పెరిగి నవంబర్‌లో 70,576 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబైకి చెందిన ఈ వెహికల్ తయారీ సంస్థ 2022 నవంబర్లో 58,303 యూనిట్లను డీలర్లకు పంపింది. గత నెలలో యుటిలిటీ వెహికల్ డిస్పాచ్‌లు 39,981 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో 30,238 యూనిట్లను అమ్మింది. అంటే వార్షికంగా సేల్స్32 శాతం పెరిగాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఎగుమతులు 2022 నవంబర్లో 3,122 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 42 శాతం క్షీణించి 1,816 యూనిట్లకు పడిపోయాయి.
బజాజ్ ఆటో
బజాజ్ ఆటోమొబైల్స్ ఈసారి అమ్మకాల్లో 31 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో 4,03,003 యూనిట్లను అమ్మింది. పూణేకు చెందిన కంపెనీ 2022 నవంబర్లో మొత్తం 3,06,719 వెహికల్స్‌ను విక్రయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో మొత్తం దేశీయ విక్రయాలు (టూవీలర్స్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్) 2022 నవంబర్లో 1,52,883 69 యూనిట్ల నుంచి 69 శాతం పెరిగి 2,57,744 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 6 శాతం క్షీణించి 1,45,259కి చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో విదేశీ మార్కెట్‌లకు 1,53,836 వెహికల్స్ పంపింది. దేశీయంగా టూవీలర్స్ విక్రయాలు 2,18,597 యూనిట్లుగా ఉన్నాయి. 2022 నవంబర్లో విక్రయించిన 1,23,657 యూనిట్ల కంటే
ఇవి 77 శాతం ఎక్కువ.