పటాన్ చెరు పీఎస్ ముందు ఉద్రిక్తత.. పోలీసుల వాహనాలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

పటాన్ చెరు పీఎస్ ముందు ఉద్రిక్తత.. పోలీసుల వాహనాలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ ని వైద్యపరీక్షలకు తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

పోలీస్ వెహికల్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు పోలీసులు. గూడెం మధుసూదన్ కాన్వాయ్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై జీఎంఆర్ నినాదాలతో కార్యకర్తలు హడావిడి చేశారు.

సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు మధుసూదన్ రెడ్డి. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకొని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లు సీజ్ చేశారు అధికారులు.