రామచంద్రాపురం, వెలుగు: విధి నిర్వహణలో జర్నలిస్టులు మానసిక ఒత్తిడికి గురి కావొద్దని పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ సూచించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు గిరి ప్రసాద్ సంస్మరణ సభను శుక్రవారం రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ వృత్తి పరంగా పోలీస్ డిపార్టుమెంటుతో సమానంగా జర్నలిస్టులు పని చేస్తున్నారని కొనియాడారు.
జర్నలిస్టులు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. వృత్తి పరంగా చాలా సార్లు సమయానికి భోజనం కూడా చేయలేని పరిస్థితిని విలేకరులు అనుభవిస్తున్నారని అన్నారు. ఉద్యోగ ధర్మంతో పాటు కుటుంబం, ఆరోగ్యం కూడా ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఎలాంటి సమస్యలొచ్చినా ఒత్తికి గురి కాకుండా ధైర్యంగా ఉండాలని, ఆనారోగ్య సమస్యలు రాకుండా జర్నలిస్టులు వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
బీఆర్ఎస్ పటాన్చెరు కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య, ఎండీఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మాదరి పృద్వీరాజ్, సీఐలు వినాయక్ రెడ్డి, నరేష్ తదితరులు గిరి ప్రసాద్‌కు నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
