గూడెం మధుసూదన్ రెడ్డి :ఎస్సైపై దాడి ఘటనలో 27మందిపై కేసు

గూడెం మధుసూదన్ రెడ్డి :ఎస్సైపై దాడి ఘటనలో 27మందిపై కేసు

సంగారెడ్డి: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డగించి వారి విధులకు ఆటంకం కలిగించిన 27 మందిపై పోలీసులు కేసు పెట్టారు. ప్రభుత్వ వాహనం ధ్వంసం చేసి, ఎస్సై రాజును గాయపరిచినందుకు కేసు నమోదు చేశారు. ఎస్ ఐ రాజు నాయక్ ఫిర్యాదు మేరకు గూడెం మధుసూదన్ రెడ్డి అనుచరులు 27 మందిపై కేసు నమోదు చేశారు.

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్  సాండ్ అండ్ గ్రానైట్స్ నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో మధుసూదన్ రెడ్డిని పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల మధుసూదన్ రెడ్డి కుమారుడి పేరిట పఠాన్ చెరు మండలం లక్డారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు.

 కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం.. లీజు గడువు ముగిసినా మైనింగ్ చేయడంపై చర్యలు తీసుకున్నారు. అయితే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ సమయంలో ఆయన అనుచరులు , బీఆర్ ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. ఈక్రమంలో ఎస్సై రాజుకు గాయాలయ్యాయి.